ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధి పెంపు సరికాదు | Sakshi
Sakshi News home page

ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధి పెంపు సరికాదు

Published Thu, Nov 16 2023 12:54 AM

భీమడోలు సదస్సులో మాట్లాడుతున్న డీఎఫ్‌వో ఎస్‌.రవిశంకర్‌రెడ్డి  - Sakshi

భీమడోలు: కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్య పరిరక్షక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ (సున్నిత పర్యావరణ ప్రాంతం)ను ప్రతిపాదించిందని, దీనిపై కొల్లేరులోని ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను తెలియజేసేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని జిల్లా వన్యప్రాణుల విభాగం డీఎఫ్‌వో ఎస్‌.రవిశంకర్‌ రెడ్డి చెప్పారు. భీమడోలు ఎంపీపీ సమావేశ మందిరంలో బుధవారం కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్య పరిరక్షణ, సరిహద్దుల గుర్తింపు కోసం సమగ్ర ప్రతిపాదనలపై మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తహసీల్దార్‌ ఎం.ఇందిరాగాంఽధీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎఫ్‌వో ఎస్‌.రవిశంకర్‌ రెడ్డి మాట్లాడుతూ కొల్లేరును పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొల్లేరు పరిధిని 10 కిలోమీటర్ల మేర పెంచుతూ ప్రతిపాదనలు చేసిందన్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేస్తే వాటిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిస్తామన్నారు. ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిని పెంచడం ద్వారా భవిష్యత్తులో కొల్లేరులో 26 అంశాలపై ముందుగా అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత కొల్లేరులో అక్రమంగా 10 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారన్నారు. ఎంపీపీ కనమాల రామయ్య, రాష్ట్ర కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్‌ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం పరిధిలోని కాంటూరును కుదించాలని దశాబ్దాలుగా వేడుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని అవేదన వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులను గ్రామ స్థాయిలో నిర్వహించి కొల్లేరువాసుల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. 10 కిలోమీటర్ల ప్రతిపాదన కొల్లేరు ప్రాంత వాసులకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఎంపీడీవో సీహెచ్‌ పద్మావతిదేవి, మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ రావిపాటి సత్యశ్రీనివాస్‌, చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు పాము మాన్‌సింగ్‌, ఎఫ్‌ఎస్‌వో పాపారత్నం, రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు, కొల్లేరు వాసులు, నాయకులు పాల్గొన్నారు.

భీమడోలు సదస్సులో కొల్లేరువాసుల మొర

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతామన్న అధికారులు

Advertisement
Advertisement