6 నెలలు 170 మరణాలు

12 Jun, 2019 09:39 IST|Sakshi
యాడికి మండలం రామరాజు పల్లికి చెందిన భూలక్ష్మి తన మనవరాలికి వైద్యం కోసం గంటన్నరపాటు ఎస్‌ఎన్‌సీయూలో వేచి ఉన్నా...ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక...బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో తెలియక ఆమె అల్లాడిపోయింది.

కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ నెలలు నిండకముందే 2 కేజీల బరువున్న పాపను ప్రసవించింది. కుటుంబీకులు నవజాత శిశువును ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూలో చేర్చారు. ఈ నెల 9న రాత్రి పాప మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని బాధిత కుటుంబీకులు ఆగ్రహం చేశారు. ఇలాంటి పరిస్థితి ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో నిత్యం చోటు చేసుకుంటోంది. గడిచిన ఆరు నెలల్లో ఏకంగా 170 మంది శిశువులు మృత్యువాత పడ్డారు.   

సాక్షి, అనంతపురం న్యూసిటీ: నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ) ఆస్పత్రిలోని చాలా కీలకమైనది. నవజాత శిశువులకు చికిత్స అందించే ఈ వార్డుపై ప్రత్యేక దృష్టిసారించి సేవలందించాల్సిన పరిస్థితి. కానీ అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం...వైద్యులు ఇష్టానుసారంగా విధులు నిర్వర్తించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల్లోనే 170 మంది శిశువులు మృత్యువాత పడగా....ఎందరో తల్లులకు కడుపుకోత మిగిలింది.

  
వైద్యుల ఇష్టారాజ్యం 
ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఎస్‌ఎన్‌సీయూలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో నలుగురు వైద్యులున్నా..ఒకరిద్దరు మినహా మిగితా వారు తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాల్సి ఉంది. కానీ కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... స్టాఫ్‌నర్సులపైనే వైద్యులు భారం వేస్తున్నారు. స్టాఫ్‌నర్సులు సైతం నర్సింగ్‌ విద్యార్థినిలకు పసికందులను అప్పజెబుతున్నారు. ఎటువంటి అనుభవం లేని వారికి పసికందులను ఇవ్వడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి.  
 

సూపరింటెండెంట్‌ వైఫల్యం వల్లే... 
సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌...ఎస్‌ఎన్‌సీయూపై దృష్టి సారించకపోవడం వల్లే వైద్యసేవల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కనీసం మందులను కూడా అందుబాటులో ఉంచకపోవడంతో రోగులంతా ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సూపరింటెండెంట్‌ తన ఛాంబర్‌ను వదిలి బయటకు రాకపోవడంతో వార్డుల్లో వైద్యులు ఇష్టానుసారం విధులు నిర్వర్తిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.     

>
మరిన్ని వార్తలు