మాకు ఊపిరి పోశారు

9 Jan, 2020 04:24 IST|Sakshi
బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ చేతిని ముద్దాడి కృతజ్ఞత తెలుపుతున్న మత్స్యకారుడు

బతికినంత కాలం మీ పేరు చెప్పుకుంటాం 

సీఎం వైఎస్‌ జగన్‌ వద్ద పాక్‌ చెర నుంచి విముక్తులైన మత్స్యకారుల ఉద్వేగం

మీకోసం మంచి జెట్టీలు నిర్మిస్తాం 

భావనపాడు పోర్టు నిర్మాణం కోసం కూడా ప్రయత్నిస్తాం 

మత్స్యకారులు గుజరాత్‌కు వలస వెళ్లే పరిస్థితి రానివ్వం 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా 

ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కుల అందజేత

సాక్షి, అమరావతి: ‘‘మీరు మాకు నిజంగా ఊపిరి పోశారు. బతికినంతకాలం మీ పేరు చెప్పుకుంటాం’’ అంటూ పాక్‌ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఉద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పాకిస్తాన్‌ చెర నుంచి విముక్తులైన 20 మంది రాష్ట్ర మత్స్యకారులు బుధవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తమ విడుదలకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతూ ‘‘మీలో ఏదో కనిపించని శక్తి ఉంది సార్‌.. అందుకే మేం బయటకు రాగలిగాం’’ అని పేర్కొన్నారు. తనను కలిసిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరుపేరునా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

చేపల వేటకోసం గుజరాత్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులపై ఆరా తీశారు. రామారావు అనే మత్స్యకారుడు ముఖ్యమంత్రికి తమ సమస్యలు వివరిస్తూ.. తమ ప్రాంతంలో సముద్రమున్నా జెట్టీలు, పోర్టు లేనందువల్ల పదివేల నుంచి పదిహేను వేల మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని, తమకు ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మించి ఇస్తే ఇక్కడే కుటుంబాలతో కలసి ఉంటామని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీరంలో మత్స్యకారుల చేపల వేట కోసం రాబోయే మూడేళ్లలో మంచి జెట్టీలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే భావనపాడు పోర్టు నిర్మాణం కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఉపాధికోసం వలస వెళ్లకుండా ఈ సాయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌లోని జైలులోనూ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఉన్నారని, కొన్ని కారణాలతో వారి విడుదలలో జాప్యం జరుగుతోందని వివరించగా.. వారిని కూడా విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్‌ జైల్లో ఇంకా మిగిలి ఉన్న ఇద్దర్ని కూడా విడిపించాలని చెప్పారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చేతుల మీదుగా.. విముక్తులైన మత్స్యకారులు నిలదొక్కుకోవడానికి వీలుగా ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కుల్ని అందజేశారు. చెక్కుతోపాటు శాలువా, స్వీట్‌బాక్స్‌ను కూడా ఇచ్చారు.

కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ జి.సోమశేఖరంతోపాటు పలువురు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జాలర్లతో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఆనాడు ప్రతిపక్ష నేతగా పాక్‌ జైలులో ఉన్న జాలర్లను విడిపించుకు వస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎం తీసుకున్న చొరవ మాటల్లో వర్ణించలేమన్నారు.

మరిన్ని వార్తలు