అమరావతిలో ‘ఎస్‌ఆర్‌ఎంకు’ 200 ఎకరాలు

18 Aug, 2016 19:50 IST|Sakshi

- మంత్రి కామినేని వ్యాఖ్య

సాక్షి, చెన్నై

 ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి అమరావతిలో రెండు వందల ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించినట్టు డాక్టర్ కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చెన్నైలోని ఆ వర్సిటీ క్యాంపస్‌కు దీటుగా అమరావతిలో క్యాంపస్ నిర్మాణం జరుగనున్నదన్నారు. చెన్నై శివారులోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో గురువారం బయో యంత్ర-2016 సదస్సు జరిగింది. ఇందులో మంత్రి కామినేని ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్యపరిజ్ఞానం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు తగ్గట్టు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో అమరావతిలో సరికొత్త రాజధాని నిర్మాణం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఇక, ఈ రాజధానిలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్ ఏర్పాటు కాబోతున్నదని తెలిపారు. ఇక్కడ ఆ సంస్థకు కనిష్ట ధరకు రెండు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో చెన్నై క్యాంపస్‌కు దీటుగా అత్యాధునికతను చాటుకునే విధంగా క్యాంపస్ నిర్మాణానికి ఆ వర్సిటీ చాన్స్‌లర్ పచ్చముత్తు పారివేందర్ చర్యలు తీసుకుంటుండడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని తెలుగు వారందరూ పుష్కరాలకు తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

 

మరిన్ని వార్తలు