ప్రతి పనికి ఓ రేటు | Sakshi
Sakshi News home page

ప్రతి పనికి ఓ రేటు

Published Thu, Aug 18 2016 7:45 PM

సైదాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం

  • సైదాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి కంపు 
  • చేయి తడిపితేనే పని
  • ఇప్పటికే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు 
  • మరి కొందరిపైనా నజర్‌..?
  • సైదాపూర్‌ : సైదాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఏపని కావాలన్నా అటెండర్‌ నుంచి అధికారి వరకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ఇందులో కూడా పనిని బట్టి రేటు ఉంటుంది. పైసలు ఇస్తేనే ఫైళ్లు కదులుతాయి. కాసులు చేతిలో పడితేనే కాగితంపై కలం గీత పడుతుంది. కులం నుంచి భూముల రికార్డుల వరకు ధ్రువీకరణ  పత్రాలు కావాలంటే రూ.100 నుంచి రూ.10 వేల వరకు లంచం ఇవ్వాల్సిందే. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సృష్టించేది, సరి చేసేందుకు కాసులు కాజేసేది వీరే. ఇక్కడ పని చేసే అధికారులు ఖాళీ జేబులతో ఆఫీసుకు వచ్చి రోజు కనీసం రూ.2 వేలు వేసుకుని ఇంటికి వెళ్లారంటే అతిశయోక్తికాదు.  
    డబ్బులు ముందు..పని తర్వాత..?
     రైతుల దగ్గర ముందు డబ్బులు తీసుకున్న కారణంగా అధికారుల్లో ఒకరికి ఒకరు పొసకకనే రైతుల పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. డబ్బులు ఇచ్చిన రైతులకు పాసు బుక్కులు లేవని, వెబ్‌ ల్యాండ్‌ పని చేయడంలేదని, లేక పని పూర్తి అయ్యింది.. కొన్ని రోజులు ఆగుమని  తమదైన∙శైలిలో నచ్చజెపుతారు. ఓ అధికారి అయితే కార్యాలయానికి పనుల కోసం వచ్చేవారిని వరుస కలుపుకుని సంబోధిస్తూ డబ్బులు వసూలు చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. పనులు కాక విసుగు చెందిన రైతులు గొడవ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వకుండా అప్పు పత్రం రాసి ఇస్తున్నట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇచ్చినా పనులు కావడంలేదని ఏళ్ల తరబడి తిరుగుతున్నామని జూలై 4న రైతులు  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  దర్నా చేశారు. సముదాయించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో బాధిత రైతులు  వాగ్వాదానికి దిగారు. డబ్బులు ఇచ్చినా ఎందుకు చేయడం లేదని నిలదీశారు.
    జీతాలు పెంచినా.. లంచాల కోసం డిమాండ్‌ 
    అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, లంచం ఆశించకుండా ఉండాలంటే వారికి సరిపోయే విధంగా వేతనాలు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచారు. అయినా అవినీతి మరింత పెరిగిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. తహసీల్‌ కార్యాలయంలో ఉద్యోగులకు జీతం కన్నా లంచంపైనే మక్కువ ఎక్కువ. 
    అధికారుల తప్పులకు.. రైతుల ఘర్షణ 
    పహణీల్లో పేర్లు తప్పులు రాసి దరఖాస్తులు పెట్టుకుంటే సరి చేస్తామంటారు. ఆ దరఖాస్తుతో మోఖామీద ఎంక్వయిరీ అంటారు. రెండు వైపులా డబ్బులు తీసుకుని ఇక్కడ మాతో కావడంలేదని దీనికి ఆర్డీవో, లేక కోర్టుల్లో పరిష్కరించుకోవాలని రైతుకు సూచిస్తారు. ఈ క్రమంలో రైతుల మధ్య భూతగాదాలు ఏర్పడి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.  
    అవినీతిపరులెందరో.. 
    పేరు మార్పు కోసం రైతు నుంచి రూ.8 వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కిన వీఆర్వో గోస్కుల రమేశ్‌తో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి కొందరు అధికారులపై ఏసీబీ దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఇదే కార్యాలయంలో కొందరు సిబ్బందిపై ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. అవినీతి అధికారులను అదుపు చేయడానికి అవినీతి నిరోదక శాఖ ఎన్నో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తూనే ఉంది. దొరికితేనే దొంగ, దొరక కుండా దండుకోవాలని మధ్యవర్తులను పెట్టుకుని మరీ లంచాలు వసూలు చేస్తున్నవారూ ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం బీమా సొమ్ము చెల్లింపులో కక్కుర్తి పడి లంచం ఆశించిన ఆర్‌ఐ సీహెచ్‌.ప్రభాకర్‌ కరీంనగర్‌లో తన ఇంటి సమీపంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ]lÊడేండ్ల క్రితం మరో ఆర్‌ఐ రైతు వెంటబడి పొలం దగ్గర ఉన్న రైతును డబ్బులు ఇవ్వమని పీడించాడు. దిక్కులేక బాధితుడు ఏసీబీకి పట్టించాడు. దుద్దెనపల్లిలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 9 గుంటల భూమికి రికార్డులలో పేరు మార్పు కోసం గత ఆరు నెలలుగా తిరుగుతున్న రైతు తాటిపల్లి రాజిరెడ్డిని రూ.15 వేలు డిమాండ్‌ చేసి రూ.8 వేలు తీసుకుంటూ వీఆర్వో రమేశ్‌ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. అయినా రెవెన్యూ అధికారుల్లో  ఏమాత్రం మార్పు రాదని మండల ప్రజలు అంటున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement