పంట నష్టం రూ.29 కోట్లు

14 Dec, 2013 04:31 IST|Sakshi


 సాక్షి, విశాఖపట్నం :
 అల్పపీడనం ప్రభావంతో పంటనష్టం తుది నివేదికను శుక్రవారం సాయంత్రం వ్యవసాయశాఖాధికారులు కలెక్టర్‌కు అందజేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 14,923 హెక్టార్లలో సుమారు రూ.29 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎట్టకేలకు తేల్చారు. ఇందుకు 59,387 మంది రైతులకు రూ.13.85కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇంకా తొమ్మిది మండలాల్లో ఒకటి రెండు పంచాయతీల్లో లెక్కింపు పూర్తికాకపోవడంతో స్వల్ప మార్పులుండొచ్చని తెలిపారు. దీనిని కలెక్టర్ పరిశీలించాక ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అప్పట్లో భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. 28,285హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు
 
 .  క్షేత్రస్థాయిలో లెక్కింపు అనంతరం 34మండలాల్లోని 14,923 హెక్టార్లలో మాత్రమే వాస్తవంగా నష్టం ఉన్నట్టు నిర్ధారించారు. 50 శాతం లోపు నష్టపోయిన పంటను, అంతర పంటల్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ప్రాథమిక అంచనాలో నష్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. రైతులు వాస్తవంగా రూ.54.57కోట్లు నష్టపోయినా ఇన్‌ఫుట్ సబ్సిడీగా ప్రభుత్వమిచ్చేది కేవలం రూ.13.85 కోట్లు మాత్రమే. వరి, వేరుశనగ,పత్తి, చెరకు పంటలకు హెక్టార్‌కు రూ.10వేలు చొప్పున, మిగతా పంటలకు హెక్టార్‌కు రూ.6,250 చొప్పున లెక్క కట్టారు. ఈ లెక్కన జిల్లాలో 59,387మంది రైతులు పరిహారం పొందడానికి అర్హులని తేల్చారు.

మరిన్ని వార్తలు