ఏసీబీ వలలో వీఆర్వో, వీఆర్‌ఏ | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్వో, వీఆర్‌ఏ

Published Sat, Dec 14 2013 4:29 AM

VRO ,VRA arrested by ACB sleuths

బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్ : మండలంలోని హన్మాజీపేట్ వీఆర్వో గణేష్, వీఆర్‌ఏ కుంట సాయిలు గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారుడు పవర్ సురేష్ వద్ద లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు ఆధ్వర్యంలో దాడి చేసి హన్మాజీపేట్ రెవెన్యూ కార్యాలయంలో వారిని పట్టుకున్నారు. బాన్సువాడ హౌసింగ్ శాఖ కార్యాలయంలో డీఎస్పీ సంజీవ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోగల కాద్లాపూర్ తండాకు చెందిన పవర్ సురేష్ అనేవ్యక్తి గృహ నిర్మాణ రుణం కోసం 2012లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇటీవల ఇందిరమ్మ పథకం కింద గృహ రుణం మంజురు కావడంతో పోజిషన్ సర్టిఫికెట్ కోసం హన్మాజీపేట్ వీఆర్వో గణేష్‌ను సంప్రదించాడు. పోజిషన్ సర్టిఫికెట్‌ను ధ్రువీకరించేందుకు వీఆర్వో రూ.4 వేలు డిమాండ్ చేశారు.
 
 నెల రోజులుగా సురేష్ పోజిషన్ సర్టిఫికేట్ కోసం తిరిగి రెండు వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే రూ. 2 వేలు ఇచ్చే స్తోమత లేదని సురేష్ తన తమ్ముడు నరేష్‌కు చెప్పాడు. దీంతో నరేష్ ఏసీని ఆశ్రయించాడని, అతడి ఫిర్యాదు మేరకు విచారణ చేసి తమ డబ్బులకు రంగుపూసి ఇచ్చామని ఏసీబీ డీఎస్పీ అన్నారు. రంగు పూసిన డబ్బులను వీఆర్‌ఏ సాయిలు తీసుకున్నాక దాడి చేసి వీఆర్వో గణేష్, వీఆర్‌ఏ సాయిలును అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. స్థానిక తహశీల్‌దార్ శ్రీకాంత్‌తో మాట్లాడామని, హౌసింగ్ కార్యాలయంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. అధికారులు లంచం అడగటం నేరమని, ఎవరైనా లంచం కోసం వేధిస్తే ఏసీబీ డీఎస్పీ నంబర్ 94404 46155కు సంప్రదించాలన్నారు.
 
 లంచం ఇవ్వలేక ఏసీబీని ఆశ్రయించాను
 - నరేష్, బాధితుడి తమ్ముడు
 పొజిషన్ సర్టిఫికెట్ ధ్రువీకరించేందుకు నెల రోజులుగా తిరుగుతున్నాం. పొజిషన్ సర్టిఫికెట్‌ను ధ్రువీకరించేందుకు వీఆర్వో గణేష్ రూ. 4 వేలు డిమండ్ చేశారని, అంత ఇచ్చుకోలేక రూ. 2 వేలు ఇస్తామన్నాం. అయితే అవికూడా లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాం.
 
 ఆర్మూర్ ఎంఈఓపై విచారణకు ఆదేశం
 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ ఎంఈఓ రాజ్ గంగారంపై విచారణకు జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల  విద్యార్థుల నుంచి రూ. 120 ఫీజుకు బదులు రూ.250 వసులు చేసినట్లు ఆర్మూర్‌కు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేయాలని కలెక్టర్ అడిషనల్  కలెక్టర్ శేషాద్రిని ఆదేశించారు. ఎంఈఓ  ప్రైవేటు పాఠశాలల నుంచి డబ్బుల వసూలు, ఇతర 6 కారణాలను ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement