మానవత్వం మంటగలిసింది..

3 Apr, 2017 12:45 IST|Sakshi
మానవత్వం మంటగలిసింది..

► శ్మశానంలో మృతదేహం
► చెరువుగట్టుపై చర్చలు
మందస : మానవతా విలువలు మంట కలిసిపోతున్నాయి. మనిషి జీవితం డబ్బే ప్రధానంగా ముందుకు సాగుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు విలువలేకుండా పోతోంది. ఇలాంటి ఘటనే మండలంలో చోటుచేసుకుంది. మందస మండలంలోని పితాతొళి గ్రామానికి చెందిన అంపోలు ప్రమీల(35) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని తల్లి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా, ప్రమీల మృతిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

మృతదేహాన్ని శనివారం సోంపేట సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమ్తితం తరలించారు. సమయం మించిపోవడంతో వైద్యులు ఆదివారం పోస్టుమార్టం చేస్తామని చెప్పి, మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆదివారం పోస్టుమార్టం జరగడంతో అంత్యక్రియలు నిమిత్తం ప్రమీల మృతదేహాన్ని పితాతొళి శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అక్కడే వివాదం మొదలైంది. ప్రమీల భర్త తిరుపతిరావు వీఆర్వోగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుమారుల భవిష్యత్‌ ఆలోచించిన పెద్దలు.. తిరుపతిరావు నుంచి హామీ కావాలని పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.

అప్పటికే రెండు రోజుల నుంచి ప్రమీల మృతదేహం ఉండగా.. అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు నిలిపివేశారు. మృతురాలి వర్గం, తిరుపతిరావు వర్గం మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం వచ్చిన మృతదేహానికి మధ్యాహ్నం రెండు గంటలైనా అంత్యక్రియలు కాలేదు. శ్మశానంలో మృతదేహాన్ని ఉంచేసి, పెద్దలు పంచాయితీకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒప్పందం అమలయ్యేలా బాండ్‌ పేపర్లు తీసుకువచ్చి, వాటిపై సంతకాలు చేయించినట్టు తెలిసింది. మృతదేహం ముందుంచుకుని డబ్బే ప్రధానంగా వాదోపవాదాలు చేసుకోవడం విస్మయపరిచిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. శుక్రవారం రాత్రి మరణించిన ప్రమీలకు.. ఆదివారం మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు జరగకపోవడం విచారకరం.

మరిన్ని వార్తలు