నేటి నుంచి 4వ విడత ఉచిత రేషన్‌

16 May, 2020 03:56 IST|Sakshi

రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి

కార్డుదారులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి

రేషన్‌ కోసం దుకాణాల వారీగా టైమ్‌స్లాట్‌ కూపన్లు జారీ

పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ ఉంటే అక్కడే రేషన్‌ తీసుకునే అవకాశం

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి నాలుగో విడత ఉచిత రేషన్‌ సరుకులు పంపిణీ చేయనుంది. లాక్‌డౌన్‌తో పనులు లేక.. పేదలు ఆకలి బాధలతో ఇబ్బంది పడకుండా వారిని ఆదుకునేందుకు మార్చి 29 నుంచి ఇప్పటివరకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతోపాటు కందిపప్పు లేదా శనగపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడత ఉచిత రేషన్‌ పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

గొడుగులు ఉపయోగిస్తే మంచిది
– కోన శశిధర్, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ
ఎండలు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చే కార్డుదారులు గొడుగులు ఉపయోగిస్తే మంచిది. గొడుగు వల్ల వ్యక్తికి, వ్యక్తికి మధ్య దూరం ఉంటుంది. సరుకుల పంపిణీలో భాగంగా బయోమెట్రిక్‌ వేయడం తప్పనిసరి. కోవిడ్‌–19 నియంత్రణలో భాగంగా చౌక దుకాణాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ రేషన్‌ తీసుకునే ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా గతంలో మాదిరి ఈసారి కూడా సరుకుల పంపిణీకి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశాం. 

► శనివారం నుంచి రేషన్‌ కార్డులో నమోదై ఉన్న ప్రతి సభ్యుడికి ఐదు కిలోల బియ్యంతోపాటు కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా ఇస్తారు.
► రాష్ట్రంలో 1,48,05,879 పేద కుటుంబాలకు ఉచితంగా సరుకులు అందనున్నాయి. 
► అర్హత ఉండి బియ్యం కార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్‌ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో కొత్తగా 81,862 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయనున్నారు.
► ఇప్పటికే బియ్యం, శనగలు రేషన్‌ షాపులకు చేరుకున్నాయి.
► కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. షాపుల వద్ద శాని టైజర్లను అందుబాటులో ఉంచారు.
► ఒకేసారి రేషన్‌ షాపుల వద్దకు రాకుండా టైమ్‌స్లాట్‌తో కూడిన కూపన్లను లబ్ధిదారులకు జారీ చేశారు. కూపన్లపై వారికి కేటాయించిన రేషన్‌ షాప్, ఏ తేదీలో, ఏ సమయానికి వెళ్లి రేషన్‌ తీసుకోవచ్చనే పూర్తి వివరాలు పొందుపరిచారు. 
► కార్డుదారులు రేషన్‌ తీసుకునే ముందు ఈ–పాస్‌లో బయోమెట్రిక్‌ తప్పనిసరి.
► లబ్ధిదారులు తమ సొంత ఊరిలో లేకపోయినా పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

మరిన్ని వార్తలు