టవరెక్కిన యువకులు

3 Dec, 2013 05:51 IST|Sakshi

 కందుకూరు, న్యూస్‌లైన్:

 గ్రామంలో సారా విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన ఆరుగురు యువకులు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. అధికారుల హామీతో వారు శాంతించారు. స్థానికుల కథనం ప్రకారం.. కొంతకాలంగా గ్రామంలో సారా విక్రయాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. దీంతో యువకులు ఎక్సైజ్ పోలీసులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. అయినా సారా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. విక్రయదారులు స్థానికంగా కొందరికి సారా తాగించి యువకులపైకి ఉసిగొల్పుతున్నారు.

 

  ఎక్సైజ్ అధికారుల అండతోనే విక్రయదారులు చెలరేగిపోతున్నారని యువకులు తెలిపారు. గ్రామానికి చెందిన యువకులు మంద పాండు, బట్టీల నర్సింహ, ఉండేల శ్రీనివాస్, వట్నాల మహేందర్, వట్నాల గణేష్,  పిట్టల శ్రీకాంత్‌లు ఎలాగైనా సారా మహమ్మారిని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామంలో ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కారు. గ్రామంలో సారా విక్రయాలు అరికట్టకుంటే దూకేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ నాగార్జున, ఎక్సైజ్ ఎస్‌ఐ చంద్రశేఖర్, వీఆర్వో శ్రీరాములు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని కిందికి దిగి రావాలని యువకుల్ని బతిమాలినా ఫలితం లేకుం డా పోయింది.  ఉన్నతాధికారులు వచ్చి సారా విక్రయాలు అరికడతామని హామీ ఇస్తేనే దిగుతామని, లేదంటే దూకుతామని స్పష్టం చేశారు. 11.45 గంటల సమయంలో తహసీల్దార్ సరిత, ఎక్సైజ్ సీఐ జావిద్‌ఆలీ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేయించి సారా విక్రయాలను పూర్తిగా అరికడతామని హామీ ఇచ్చారు.

 

 దీంతో యువకులు ఆందోళన విరమించి కిందికి దిగివచ్చారు. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. అనంతరం అధికారులు గ్రామం లో పర్యటించి సారా విక్రదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకపై సారా అమ్మితే విక్రయదారులకు రేషన్ సరుకులతో పాటు సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు