ఫలించని ‘పోలీస్' వ్యూహం

8 Nov, 2014 01:16 IST|Sakshi
ఫలించని ‘పోలీస్' వ్యూహం

నెల్లూరు(క్రైమ్): జిల్లాలో దొంగల ముఠాలు తిష్టవేశాయి. పగలు..రాత్రి తేడా లేకుండా దొంగతనాలకు తెగబడుతున్నారు. పగలు రెక్కీ నిర్వహించి, తాళం వేసిన ఇల్లు కనిపిస్తే రాత్రికి దోచేస్తున్నారు. చోరీలను నియంత్రించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టినా ఫలితం కరువైంది. నాలుగు నెలల్లో సుమారు రూ.2.35 కోట్ల విలువైన సొత్తు చోరీకి గురికాగా, చైన్‌స్నాచింగ్‌లు, వాహన దొంగతనాలు లెక్కలేదనే చెప్పాలి.

ఇటీవల కాలంలో జిల్లాలో ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో శివారు ప్రాంతాలే దొంగల టార్గెట్ కాగా, ఇప్పుడు జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ చోరీలకు తెగబడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు నకిలీ పోలీసులు, ఆటోడ్రైవర్ల ముసుగులోని దుండగులు అందిన కాడికి దోచుకుంటున్నారు. నాలుగు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 82కి పైగా దొంగతనాలు జరిగాయి. అన్ని ఘటనల్లో కలిపి సుమారు రూ.1.25 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. బైక్‌లు, లారీలను సైతం దొంగలు అపహరించారు.

ఇక చైన్ స్నాచింగ్‌లైతే లెక్కేలేదు. వరుస దొంగతనాల నేపథ్యంలో మహిళలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరోవైపు ఇళ్లలో ఉన్నా దొంగల బారిన పడుతుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

 బందోబస్తుకే సీసీఎస్ పరిమితం
 సాధారణంగా జిల్లాలో ఎక్కడ చోరీలు, దోపిడీలు జరిగినా దర్యాప్తునకు సంబంధించి వెంటనే గుర్తుకొచ్చేది సీసీఎస్ మాత్రమే. ఈ తరహా కేసులను ఆ విభాగ పోలీసులు ఎన్నో పరిష్కరించారు. అయితే రెండేళ్లుగా సీసీఎస్ విభాగం సేవలు కేవలం బందోబస్తుకే పరిమితమయ్యాయి. కీలకమైన ఈ విభాగాన్ని జిల్లాలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఉన్నతాధికారులు ఏదేని కేసు అప్పగిస్తే తప్ప ప్రత్యేకంగా దృష్టిపెట్టని పరిస్థితి నెలకొంది.

 పోలీసులకు సవాల్..
 తమిళనాడు ఇందిరానగర్ సెటిల్‌మెంట్ ఏరియా, కృష్ణగిరి, తిరుచ్చి,  ఇరువాక్కం, చిత్తూరు జిల్లా  ఓజికుప్పం, శ్రీకాళహస్తి, ఒంగోలు రాంనగర్, స్టూవర్టుపురం, కర్నూలు జిల్లా నూనెపల్లికి చెందిన దొంగలతో పాటు ఇరానీ ముఠాలు జిల్లాలో తిష్టవేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  నేరనియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించారు.

గస్తీ పెంచడంతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్‌లు సైతం నిర్వహించారు. అయినా ఫలితాలు ఆశాజనకంగా లేవు. రోజూ ఏదో ఒక చోట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. కొన్ని చైన్‌స్నాచింగ్ కేసులను చేధించిన పోలీసులకు విస్తుపోయే అనుభవాలు ఎదురయ్యాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన విద్యావంతులు పలువురు చైన్‌స్నాచర్లుగా అవతారమెత్తినట్లు వెలుగులోకి వచ్చింది.

 ఇటీ వల జరిగిన కొన్ని ఘటనలు
  సెప్టెంబర్ 15న జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు పడి సుమారు 32సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 5.57లక్షల విలువచేసే సొత్తు అపహరించారు.

  17న నెల్లూరులోని ఆర్‌పీఎఫ్ క్వార్టర్స్‌లోని ఓ కానిస్టేబుల్ ఇంట్లో 20గ్రాముల  బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

  22న కరెంట్‌ఆఫీస్ సెంటర్లో రెండు ఇళ్లలో దొంగలు పడి 9 సవర్ల బంగారు ఆభరణాలు, 15వేల నగదు అపహరించారు.

  అక్టోబర్‌లో బుచ్చిరెడ్డిపాళెం మం డలం జొన్నవాడ, కోవూరు మండలం పాటూరులో ఇద్దరు మహిళలను హతమార్చి బంగారు నగలను దోచుకెళ్లారు.

  గత నెలలోనే నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఓ రోగికి చెందిన 7సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

  మనుబోలు సమీపంలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డులో ఉన్న పవర్‌గ్రిడ్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో సుమారు రూ.75 లక్షలు చోరీకి గురైన ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. క్వార్టర్స్‌లోని ఐదుగురు ఉద్యోగుల ఇళ్లలో దొంగలు చోరీలకు తెగబడ్డారు.

  శుక్రవారమే కోటలో ఇన్‌కంట్యాంక్స్ అధికారులమంటూ ముగ్గురు యువకు లు ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధ దంపతులను బెదిరించి రూ.10 సవర్ల బంగారు, రూ.70 వేలు నగదు దోచుకెళ్లారు.
 
 
 చోరీల నియంత్రణకు పటిష్ట చర్యలు:
 చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రత్యేక బృందాలను నియమించి నిఘా ముమ్మరం చేశాం. ఇప్పటికే పలువురు గజ దొంగలను అరెస్ట్ చేసి సుమారు రూ.70 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ప్రజలు కూడా సహకరించి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై 100, 94946 26644 నంబర్లకు సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తాం.
 - సెంథిల్‌కుమార్, ఎస్పీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు