ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్

22 May, 2015 15:31 IST|Sakshi

నక్కపల్లి (విశాఖపట్నం): గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం తీసుకుంటూ నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... రాంబిల్లికి చెందిన లక్ష్మీనర్సింహకు ఉపమాకలో రెండు ఎకరాలభూమి ఉంది. ఈ ఆస్తిని తన సోదరి విజయలక్ష్మి కూతురు సునీత పేరున గిప్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, దానితోపాటు రూ. 10వేలు మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడినా.. ఇస్తేనే రిజిస్ట్రేషన్ అని రిజిస్ట్రార్ స్పష్టం చేశాడు. చేసేది లేక బాధితుడు ఒప్పుకున్నాడు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.

శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు బాధితుడికి నగదు ఇచ్చి పంపించారు. ఉదయం 11గంటలకు 10వేల రూపాయలు ఇవ్వగా టేబుల్ సొరుగులో పెట్టాలని రిజిస్ట్రార్‌ సూచించారు. ఆయన చెప్పిన ప్రకారం డబ్బు సొరుగులో పెట్టిన అనంతరం రిజిస్ట్రార్‌ అక్కడ ఉన్న యర్రా సత్తిబాబుని పిలిచి.. రూ.10వేల నగదు ఉందో లేదో చూడాలన్నాడు. సరిచూసిన అనంతరం ఆ సొమ్మును కొత్త సందీప్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. నగదు సందీప్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. లంచంతీసుకున్న సబ్‌రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావుతోపాటు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న యర్రా సత్తిబాబు, కొత్త సందీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు