ఇదేం ఖర్మరా ‘బాబు’..!

26 Feb, 2019 10:16 IST|Sakshi
బాండ్ల పరిశీలనకు బాధితుల కష్టాలు...

జిల్లాలో 1,78,470 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు

నాలుగున్నరేళ్లు వారి బాధలు పట్టించుకోని ప్రభుత్వం

జిల్లాలో బాధితులకు అందాల్సింది రూ.765 కోట్లు

ఎన్నికలవేళ రూ.250 కోట్ల విడుదల

దరఖాస్తులు అందజేసేందుకు ఆపసోపాలు

గంటల తరబడి నిరీక్షణ

కలెక్టర్‌ సహకారం               తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు

ముందే మేలుకుని ఉంటే 18 మంది ప్రాణాలు నిలిచేవి

మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీలకు అప్పగిస్తే కాస్త ఊరట

అగ్రిగోల్డు బాధితులకు నాలుగున్నరేళ్లుగా కంటిమీద కునుకు కరువైంది. సంస్థ బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు రోడ్డున పడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించింది. బాధితుల ఆందోళనతో గత ఏడాది పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో బాధితుల వివరాలను నమోదు చేయించింది. ఇప్పుడు ఆ వివరాలను పక్కనపెట్టి... మళ్లీ న్యాయసేవాధికార సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల వేళ రూ.10వేల లోపు డిపాజిట్ల చెల్లింపునకు శ్రీకారం చుట్టింది. డబ్బుల మాటను పక్కన పెడితే దరఖాస్తుల పరిశీలనకు రోజంతా తిండిలేకుండా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. బాధితుల సంఖ్య అధికంగా ఉండడం.. నమోదు గడువు తక్కువగా ఉండడంతో బాధితులు కలవరపడుతున్నారు. ఆ ఇచ్చే డబ్బులూ అందుతాయోలేదోనని బెంగపడుతున్నారు. కోర్టు ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు. ఇదేం ఖర్మరా ‘బాబు’ అంటూ నిట్టూర్చుతున్నారు.   

సాక్షిప్రతినిధి, విజయనగరం: కొడుకు చదువుకోసం.. ఆడపిల్లల పెళ్లికోసం.. వాహనాల కొనుగోలుకు.. ఇళ్ల నిర్మాణం కోసం.. తినీతినక, చెమటను ధారబోసి రూపాయిరూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బులను అగ్రిగోల్డ్‌ సంస్థలో పేద, మధ్య తరగతి ప్రజలు పొదుపు చేశారు. ఇరవై ఏళ్లుగా సంస్థ సేవలందిస్తుందనే నమ్మకంతో పొదుపు ఖాతాల్లో డిపాజిట్లు పెట్టారు. దురదృష్టవశాత్తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. ఒక్కసారిగా అందరూ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఖాతాదారులందరూ ఆశించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో వీరంతా ఆవేదనలో మునిగిపోయారు. కొందరుకొత్త అప్పులు చేశారు. కొందరు ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు తాము కట్టిన డబ్బుల కోసం నానా తిప్పలు పడుతున్నారు.

సంఖ్య అధికం.. గడువు స్వల్పం
జిల్లాలో 1,78,470 మంది అగ్రిగోల్డ్‌ బాధితుండగా వీరికి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.765 కోట్లు ఉంది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో జిల్లాలో 18 మంది అగ్నిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారిలో సగం మందికి నేటికీ పరిహారం అందలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. బాధితుల్లో రూ.10వేల లోపు డిపాజిట్లు కట్టినవారికి తిరిగిస్తామని ప్రకటించింది. జిల్లాలో అలాంటి వారు సుమారు 30 వేల మంది ఉన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 11 లోపు డాక్యుమెంట్లు పరిశీలించేందుకు గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోంది. అయితే, జిల్లా మొత్తం మీద బాధితులు వివరాలు నమోదు చేసుకోవడానికి విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రమే ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి అవకాశం కల్పించారు. అయితే, ఆ గడువు ఏ మాత్రం సరిపోదని బాధితులు చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో కేవలం సుమారు 650 మంది ఖాతాదారుల పత్రాల పరిశీలనే పూర్తయ్యింది.

కౌంటర్లు, సిబ్బంది సంఖ్య పెంచాలి
జిల్లా వ్యాప్తంగా న్యాయసేవాధికార సంస్థకు సంబంధించిన తొమ్మిది కేంద్రాలు విజయనగరం, ఎస్‌.కోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురుపాంలో ఉన్నాయి. వీటన్నింటిలో డాక్యుమెంట్ల పరిశీలనకు అవకాశం ఇచ్చి ఉంటే కాస్త ఊరట ఉండేది. కానీ అలా జరగకపోవడం వల్ల కొద్దిపాటి మొత్తం కోసం జనం నానా అవస్థలు పడుతున్నారు. తాము కట్టిన డబ్బులు తమకు వస్తాయో, రావోననే ఆందోళనలో జిల్లా నలుమూల నుంచి వచ్చి న్యాయసేవాధికార సంస్థ వద్ద పత్రాల పరిశీలనకు పోటీ పడుతూ, ఎండల్లో అవస్థలు పడుతూ, లైన్లలో నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన కౌంటర్లు, సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నారు. దీనిని గుర్తించిన హైకోర్టు జిల్లా కలెక్టర్‌ సహకారం తీసుకోవాల్సిందిగా న్యాయసేవాధికార సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

చాలా మందికి అన్యాయం
ఒరిజనల్‌ బాండ్, ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, ఒరిజినల్‌ బ్యాంకు బుక్, రెండు జతల నకళ్లు తీసుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళితే అక్కడ పరిశీలించి, అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయితే ఆ జాబితానే జిల్లా కలెక్టర్‌కు అందిస్తారు. వారంలో కలెక్టర్‌ పరిశీలించిన నివేదిక ఆధారంగా మార్చి 20 లోపు బాధితుల బ్యాంకు ఖాతాలో కొంత మొత్తాన్ని వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కేవలం ఒకేసారి ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసిన వారికి మాత్రమే అది కూడా రూ.పదివేల లోపు ఉంటేనే డిపాజిట్‌ తిరిగిస్తామంటున్నారు. కానీ చాలా మంది చిరు వ్యాపారులు, పేదలు రోజువారీ, పదిహేనురోజులకోసారి, నెలవారీ కొంత మొత్తాల చొప్పున చెల్లించారు. వారికి తాజా ప్రక్రియలో ఎలాంటి ప్రయోజనం లేదు. వారు కట్టిన డబ్బులు లెక్కలోకి తీసుకోవడం లేదు. 2014లో ఒరిజినల్‌ బాండ్లను అగ్నిగోల్డ్‌ సంస్థ వెనక్కు తీసుకుంది. ఖాతాదారుల వద్ద వాటి నకళ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ నకళ్లను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు నష్టపోతున్నారు.  

ఏజెంట్లపై పెరుగుతున్న ఒత్తిడి
అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రతీ జిల్లాలో 70 వేల మంది వరకూ ఉన్నారు. ఒక్కో కౌంటర్‌లో రోజుకి 100 నుంచి 150 మంది పత్రాల పరిశీలనే పూర్తవుతోంది. కనీసం రోజుకి వెయ్యి మంది పత్రాలు పరిశీలించినా 70 రోజులు పడుతుంది. ఇచ్చిన గడువు కేవలం 15 రోజులే. అది ఏ మాత్రం సరిపోదు. సబ్‌ కోర్టుల్లో కూడా అవకాశం కల్పించి ఉంటే కొంతలో కొంత ప్రయోజనం ఉండేది. తాజా ప్రక్రియతో ఏజెంట్లపై ఒత్తిడి పెరుగుతోంది.– మజ్జి సూరప్పడు, జిల్లా అధ్యక్షుడు,అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, విజయనగరం

మరిన్ని వార్తలు