2019 కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాలే నాంది

4 Aug, 2017 03:09 IST|Sakshi

ప్రజలకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
ఇది మోసపూరిత వాగ్దానాలు, కుట్రపూరిత రాజకీయాలు, అవినీతి అసమర్థ పాలనపై మీరిచ్చే తీర్పు
చంద్రబాబుకు ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి
మూడేళ్ల పరిపాలనలో ఒక్క పనైనా చేశారా?
నంద్యాలకు ప్రకటించిన ప్రతి పథకంలోనూ లంచాలే
విలువలతో కూడిన రాజకీయాల కోసమే చక్రపాణి రాజీనామా కోరా


  2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది నంద్యాలే. ఈ ఎన్నికల్లో ప్రజలది శ్రీకృష్ణుడి పాత్ర.

మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేసిన మోసపూరిత వాగ్దానాల మీద, కుట్ర పూరిత రాజకీయాల మీద, అవినీతి పాలన మీద, అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా ఈ నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయి

నంద్యాల ప్రజలంతా జడ్జి స్థానంలో ఉండి చంద్రబాబు లాంటి వ్యక్తికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి

అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది. ఒక్క హామీనైనా అమలు చేశారా అని అడుగుతున్నా? ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా?

కేవశరెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తా నని మాట ఇస్తున్నా. చంద్రబాబు

చొక్కాను, ఆదినారాయణ రెడ్డి నిక్కరును ఊడదీస్తాం.

ప్రతి పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా చేస్తాం. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 చేస్తాం.

ఆర్యవైశ్య సోదరులు ప్రత్యేక కార్పొరేషన్‌ కోసం ఎవరివద్దకూ పోవాల్సిన అవసరం లేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తాం.

నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే... చంద్రబాబు నంద్యాలకు కనీసం ఒక్క రూపా ౖయెనా విదిల్చేవాడా అని అడుగుతున్నా?

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి.

నంద్యాలకు చంద్రబాబు వచ్చినప్పుడు అడగండి. మూడేళ్లుగా మాకేం చేశావని.

2018లో వైఎస్సార్‌సీపీకి వచ్చే ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని నంద్యాలకు చెందిన ముస్లింకే ఇస్తాం.

ఈ నెల 9వ తేదీ నుంచి 21 వరకూ నేను నంద్యాలలోనే ఉంటా.

టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన్ను పులి అందామా.. సింహం అందామా...

సాక్షి ప్రతినిధి, కర్నూలు  :
2019లో జరగబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నంద్యాలే నాంది కావాలని...నంద్యాల ప్రజలు జడ్జిపాత్ర పోషించి, ఈవీఎం అనే విష్ణుచక్రాన్ని వదిలి చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించాలని ప్రతిపక్ష నేత,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసపు వాగ్దానాలు, అవినీతి పాలన, కుట్ర రాజకీయాలు, అసమర్థపాలన మీద ప్రజలిచ్చే తీర్పుగా నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయని నంద్యాలలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన అభివర్ణించారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లల్లో ఒక్క వాగ్దానాన్ని అమలు చేయని వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయబట్టే నంద్యాల రోడ్లపై ముఖ్యమంత్రి, మంత్రులు తిరుగుతున్నారని పేర్కొన్నారు.

కేశవరెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని జగన్‌ హామీనిచ్చారు. నంద్యాలను జిల్లా చేస్తామని...రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచుతామని పేర్కొన్నారు. ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలన్నారు. 2018లో పార్టీకి వచ్చే ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నంద్యాలకు చెందిన ముస్లింలకే కేటాయిస్తామని హామీనిచ్చారు.

దర్మానికి– అధర్మానికి, న్యాయానికి–అన్యాయానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలిచి చంద్రబాబుకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అబద్దపు హామీలతో, పర్సంటేజీలతో పనులు చేస్తున్న ఇటువంటి వ్యక్తిని ఏమని పిలవాలో చెప్పాలని ప్రజలను కోరారు. ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ నంద్యాలలోనే ఉంటానని.... పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నంద్యాలలోని ఎస్‌పీజీ గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

తప్పు చేస్తున్నావ్‌ చంద్రబాబూ!: ‘‘నంద్యాలకు చంద్రబాబు వచ్చినపుడు అడగండి. మూడేళ్లుగా మాకేం చేశావని అడగండి. చంద్రబాబుకు కూడా తెలుసు. తానేమీ చేయలేదని, ప్రజల దగ్గరికి పోతే కొడతారని ఆయనకు తెలుసు. అందుకే కళ్లు పెద్దవి చేసి ప్రజలపై పిచ్చి కోపం చూపిస్తాడు. నా పెన్షన్లు తింటున్నారు. నేనిచ్చే రేషన్‌ తింటున్నారు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు. నేను వేసిన దీపాల కింద కూర్చుంటున్నారు. నాకు ఓటు వేయకపోతే ఎలా? లేదంటే పెన్షన్లు, రేషన్‌ తీసుకోవద్దు. నాకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బెదిరిస్తున్నారు. తప్పు చేస్తున్నావ్‌ చంద్రబాబూ అని చెబుతున్నా. నువ్వు చెబుతున్న అవే రోడ్లపై నిలబడి నిన్ను ప్రశ్నిస్తాం. అవే వీధి దీపాల కింద కూర్చుని నిన్ను నిలదీస్తాం. నువ్వు ఇచ్చేది నీ అత్తగారి సొత్తా చంద్రబాబూ?


మహా సంగ్రామంలో ఇది తొలిమెట్టు..: మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో సంవత్సరంన్నరలోనే మళ్లీ ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. నంద్యాలలో మీరు వేసే ఓటు ఆ కురుక్షేత్ర మహా సంగ్రామానికి  తొలిమెట్టు కాబోతోంది. రేపు జరగబోయే మార్పుకు నంద్యాల నాంది పలకబోతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత నాకొదిలేయండి అని భరోసా ఇస్తున్నా. విత్తనానికి, వ్యవసాయానికి నంద్యాలను కేంద్ర బిందువుగా చేస్తాం. ఇక్కడే వ్యవసాయ యూనివర్సిటీ పెడతాం.

కుందూ నది వల్ల నంద్యాల ఎంత బాధపడుతోందో తెలుసు. అక్కడ పనులు చూసా. కానీ జనాన్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు అక్కడ పెట్టిన నాలుగు పొక్లెయిన్ల వల్ల జరిగేది కాదది. ఆ పనులు పూర్తిచేసే మంచితనం చంద్రబాబుకు లేదు. నాకు వదిలేయండి ఆ పనులు నేను చూసుకుంటా. నంద్యాలను మోడల్‌ టౌన్‌గా అభివృద్ధి చేస్తాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఓ కారణముంది. ప్లీనరీలో నవరత్నాల పథకాలను ప్రకటించాం. ఆ నవరత్నాలు రేపు రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఆ నవరత్నాలను అందించబోతున్నాం.

జిల్లాలు 25 చేస్తాం..: ప్రతికుటుంబానికీ ఆ నవరత్నాలు అందాలంటే ఇపుడున్న వ్యవస్థ మారాలి. ఇది ఇంకా బలపడాలి. ఈ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా, నవరత్నాలను ప్రతి కుటుంబానికీ చేర్చే దిశగా ఇపుడున్న జిల్లాలను మార్చబోతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లా చేయబోతున్నాం. ఇపుడున్న జిల్లాలను 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్‌గా నంద్యాలే ఉంటుంది.

 ఒకసారి నంద్యాల జిల్లా అయిపోతే ఇక్కడే మీ కళ్ల ముందే కలెక్టరేట్, ఎస్పీకార్యాలయం, జిల్లా పరిషత్‌ కార్యాలయం, జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ప్రతి ప్రభుత్వ కార్యాలయం వస్తుంది. జిల్లా కేంద్రంగా నంద్యాల అత్యంత వేగంగా, అత్యంత అభివృద్ధి చెందుతుందని వేరే చెప్పనక్కరలేదు. నవరత్నాల అమలుకు నంద్యాలే నాంది కావాలని కోరుతున్నా. నంద్యాల అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాకొదిలేయండి.

అందరికీ న్యాయం చేస్తాం.. మోసగాళ్లకు బుద్ది చెబుతాం: ఇల్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. చంద్రబాబు లంచాలు తీసుకున్న డబ్బును మీరు అప్పుగా బ్యాంకులకు కంతులు కట్టాల్సిన పనిలేదు. ప్రతిపేద వాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెబుతున్నా. ఇల్లు కట్టివ్వడమే కాదు. రిజిస్ట్రేషన్‌ చేసిన పత్రాలను కూడా వారి చేతికిస్తాం. నంద్యాలలో రోడ్డు విస్తరణ పేరుతో ఏ సంప్రదింపులు లేకుండా సరైన పరిహారం దక్కకుండా అన్యాయానికి గురైనవారందరికీ పూర్తిగా న్యాయం చేస్తాం.

 చంద్రబాబును ఎన్నిమార్లు అడిగినా ఆర్యవైశ్య కార్పొరేషన్‌ పెట్టడం లేదని ఆర్యవైశ్య సోదరులు బాధపడుతున్నారు. ఆ సోదరులు ఇక ఎవరిదగ్గరికీ పోవలసిన పనిలేదు. అధికారంలోకి మనమే వస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ స్థాపిస్తాం. మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలని మైనారిటీ సోదరులు అడుగుతున్నారు. 2019లో కురుక్షేత్ర యుద్ధం. దానికన్నా ముందు 2018లో వైఎస్సార్సీపీకి ఒక ఎమ్మెల్సీ సీటు రానుంది. ఆ వచ్చే ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాలకు చెందిన ముస్లిం సోదరుడికే ఇస్తానని మాట ఇస్తున్నా.

 కేశవరెడ్డి బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తామని మాట ఇస్తున్నా. చంద్రబాబు చొక్కాను, ఆదినారాయణరెడ్డి నిక్కరును ఊడదీస్తాం. కేశవరెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేస్తాం. కేసులన్నీ తిరగదోడతాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు కూడా గతంలో హామీ ఇచ్చా. అగ్రిగోల్డ్‌ బాధితులైనా, కేశవరెడ్డి బాధితులైనా మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వారికి ఇవ్వాల్సిన వన్నీ పూర్తిగా ఇచ్చేస్తాం. ఆ తర్వాత మోసం చేసిన వాళ్ల దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో, వాళ్ల చొక్కాలు, నిక్కర్లు ఎలా ఇప్పించాలో ప్రభుత్వం చూసుకుంటుంది. నంద్యాలలో మీరు ఇచ్చే ఆశీస్సులు రేపటి మన విజయానికి పునాది కావాలి.

ఈ వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం : ఇవాళ చంద్రబాబు దగ్గరుండి డబ్బులు, పదవి ఆశచూపించి కొనుగోలు చేస్తున్నాడు. ఇటువంటి కలియుగ రాక్షసుడిని హతమార్చేందుకు మీరంతా సవ్యసాచులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నంద్యాల ప్రజలు నడుం బిగించాలి. ఇవాళ వంచనకు విశ్వసనీయతకు మధ్య పోరాటం జరుగుతోంది. మన అభ్యర్థి శిల్పా మోహనరెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి విజ్ఞప్తి చేస్తున్నా.

తోడుగా నిలబడాలని కోరుతున్నా. మన గుర్తు ఫ్యాన్‌. 9వ తారీఖు నుంచి 21 వరకు నేను నంద్యాలలోనే ఉంటా. ప్రతి వీధికీ వస్తా. ప్రతి ఊరుకూ వస్తా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో న్యాయం ఎవరికీ జరగదు. రాజగోపాల్‌ అన్నకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం. చక్రపాణి అన్నకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చి న్యాయం చేస్తాం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా : వైఎస్సార్సీపీకి ఓటు వేసినా జగన్‌ ఇప్పుడే సీఎం కాడు కదా అని తెలుగుదేశం పార్టీవారు ప్రచారం చేస్తున్నారట. ధర్మానికీ, న్యాయానికీ ఓటు వేద్దామా? లేక అధర్మానికీ, మోసానికీ ఓటు వేద్దామా అన్న దానిపైనే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలతో బహుశా జగన్‌ వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ మీరిచ్చే ఆశీస్సులతో సంవత్సరంన్నర తర్వాత జరగబోయే కురుక్షేత్రానికి ఇది నాంది పలుకుతుంది. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆ వ్యత్యా సాన్ని నేను చూపుతున్నా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి నా దగ్గరకు వచ్చారు. నేను ఒకటే మాట చెప్పాను. చంద్రబాబు మాదిరిగా నేను రాజకీయాలు చేయలేను. న్యాయం, ధర్మం అనే రెండు కాళ్లపై మనం నిలబడాలి.

చంద్రబాబు ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు మొహాన కొట్టు అన్నా అని అడిగా. అలా కొడితేనే ప్రజలు మనలను దీవిస్తారు. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. కొంచెం కష్టమనిపించినా చక్రపాణిరెడ్డి ఒక మంచి మనిషిగా బైటకొచ్చాడు. ఇదిగో.. స్పీకర్‌ ఫార్మాట్‌లో కౌన్సిల్‌ చైర్మన్‌కు రాజీనామా లేఖ రాసిస్తున్నాను మీరే పంపించండి అని అన్నాడు. పులి అంటారో సింహం అంటారో మీయిష్టం..

ఎన్నికలొస్తేనే ముస్లింలు గుర్తొస్తారా?
ముస్లిం మైనారిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉన్నదల్లా కపట ప్రేమేనని, ఆయనకు వారి పట్ల ఎలాంటి ఆదరాభిమానాలు లేవని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నంద్యాలకు ఉప ఎన్నికలొచ్చేటప్పటికి చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ఆయన మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేరు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలో కూడా ఒక ముస్లిం ఉన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో లేనే లేరు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేక పోవడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు. అది ఒక్క చంద్రబాబు హయాంలో మాత్రమే జరుగుతోంది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను ఎమ్మెల్సీని చేసి మూడో రోజే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఒక ముస్లింను ఎమ్మెల్సీని చేసి, మంత్రివర్గంలోకి తీసుకుందామన్న ఆలోచనే చేయలేదు’ అని అన్నారు.

నంద్యాలకు లంచాల పథకాలు
‘‘నంద్యాల ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన ప్రతి పథకంలోనూ ఒక లెక్క ఉంది. ప్రతి పథకంలోనూ లంచాలున్నాయి.’’ అని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. నంద్యాలకు ప్రకటించిన పథకాలలో దాగి ఉన్న అవినీతిని ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఏ పథకంలో ఏం కుంభకోణం జరుగుతుందో వివరించారు. ఇళ్లు, ట్రాక్టర్లు ఇలా ప్రతి పథకంలోనూ అవినీతి దాగి ఉందన్నారు. ఉప ఎన్నికల కోసమే నంద్యాలలో పెన్షన్ల సంఖ్యను పెంచారని చెప్పారు.

విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం
‘‘ఇవాళ నంద్యాలలో జరుగుతోన్నది ధర్మానికి,అధర్మానికి మధ్య,  న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. విశ్వసనీయ రాజకీయాలకు, వంచనతో కూడిన రాజకీయాలకు జరుగుతున్న యుద్ధమిది.’’ అని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు  చేసిన మోసపూరిత వాగ్దానాల మీద, కుట్ర పూరిత రాజకీయాల మీద, అవినీతి పాలన మీద, అసమర్థ పాలన మీద ప్రజలిచ్చే తీర్పుగా ఈ నంద్యాల ఎన్నికలు జరగబోతున్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. నంద్యాలలో వైఎస్సార్సీపీ పోటీపెట్టబట్టే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మొత్తం కేబినెట్‌ అంతా రోడ్లపైకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈవీఎం అనే విష్ణుచక్రాన్ని తిప్పి చంద్రబాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని జగన్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు