వేళలకు మంగళం

2 Nov, 2013 04:21 IST|Sakshi

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలులోకి వచ్చిన నూతన వేళలకు కార్యకర్తలు తొలిరోజే మంగళం పాడారు. పారితోషికంతోపాటు పనిగంటలు పెంచుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఒంగోలు నగరంలో తొంభై శాతానికిపైగా అంగన్‌వాడీ కేంద్రాలు మధ్యాహ్నం రెండుగంటల్లోపే మూతపడ్డాయి. దానికితోడు అంగన్‌వాడీ కేంద్రాలకు సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించడంతో కేంద్రాల్లో చిన్నారులు లేక బోసిపోయాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల పనివేళలను పెంచుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తూ వచ్చారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు స్వల్పంగా పెంచుతూ కేంద్రాలను సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు.
 జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 4093 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు అన్ని కేంద్రాలకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ 3700, ఆయాకు రూ 1950 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కేంద్రాల వేళలతోపాటు కార్యకర్తకు రూ 500, ఆయాకు రూ 250 పెంచారు. కార్యకర్తకు 4200, ఆయాకు రూ 2,200 వేతనంగా నిర్ణయించారు.
 పెదవి విరుస్తున్న అంగన్‌వాడీలు:
 వేతనాలు స్వల్పంగా పెంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాలను నిర్వహించడంపై అంగన్‌వాడీలు పెదవి విరుస్తున్నారు. అన్ని గంటలపాటు చిన్నారులను కేంద్రాల్లో కూర్చోబెట్టుకోవడం కష్టంగా ఉంటుందని వాపోతున్నారు. కేంద్రానికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం వరకు ఉండటమే గగనమైన నేపథ్యంలో సాయంత్రం వరకు ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా తాము కేంద్రాలను నిర్వహిస్తే వారికందించే సౌకర్యాలు తమకు వర్తింప చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నెలరోజులకు పైగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని, తాజాగా కోడిగుడ్లను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం తప్పితే వాటిని సరఫరా చేయలేదన్నారు. ఒకవైపు హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమాధానాలు చెప్పుకోలేక, ఇంకోవైపు ఏడుగంటలపాటు కేంద్రాలను నిర్వహించలేక అంగన్‌వాడీలు సతమతమవుతున్నారు. వేళల పెంపుపై నిరసనలు తెలిపేందుకు అంగన్‌వాడీలు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు