అంతా హస్తిన రోడ్‌మ్యాప్ మేరకే

30 Jan, 2014 02:37 IST|Sakshi
 
 విభజన బిల్లు విషయంలో ఉభయసభల లోపలా, బయటా పరిణామాలన్నీ పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం రోడ్‌మ్యాప్ ప్రకారమే ముందుకు సాగుతున్నాయని కొంతకాలంగా నెలకొంటున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులతో సహ కాంగ్రెస్ నేతలంతా అధిష్టానం రూపొందించిన స్క్రిప్టుకు అనుగుణంగానే తమ తమ పాత్రలను పోషిస్తున్నారన్న అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. సభలో చర్చ జరిగేలా చేయడం, అదే సమయంలో మెజారిటీ సభ్యుల నుంచి బిల్లుపై వ్యతిరేకాభిప్రాయం మాత్రం రాకుండా చర్చ అర్ధంతరంగానే ముగిసేలా చూడటం హస్తిన వ్యూహం మేరకే జరిగిందంటున్నారు.
 
సభలో బిల్లుపై చర్చలో సభ్యులందరూ పాల్గొని వ్యతిరేకాభిప్రాయం చెప్పాలని, అప్పుడు కేంద్రం దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీలుండదని చెప్పడం ద్వారా సీమాంధ్ర ఎమ్మెల్యేలను కిరణ్ ముగ్గులోకి దింపారు. అలా చర్చకు అంగీకరిస్తే విభజనకు అంగీకరించడమే అవుతుందని, ఇది సరికాదని, సమైక్య తీర్మానం చేయాలని, లేదంటే బిల్లుపై ముందుగానే ఓటింగ్ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఎంతగా పట్టుబట్టినా... వారిని సస్పెండ్ చేసి మరీ కిరణ్ ఈ వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లారు. టీడీపీ కూడా కాంగ్రెస్ వ్యూహానికి సహకరిస్తూ చర్చకే వంతపాడింది. ఇక చర్చ మొదలయ్యాక సీమాంధ్ర సభ్యులంతా అభిప్రాయాలు చెబుతూ, సభ సాఫీగా సాగుతున్న సమయంలోనే కిరణ్ ఉన్నట్టుండి రూటు మార్చారు.
 
బిల్లుపై అప్పటికే మూడు విడతలుగా మాట్లాడి తన అభిప్రాయం చెప్పాక, బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేద్దామంటూ అకస్మాత్తుగా స్పీకర్‌కు నోటీసిచ్చారు. తద్వారా గత మూడు రోజులుగా సభలో గందరగోళం తలెత్తే పరిస్థితులు కల్పించారు. సభ జరగొద్దనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగానే ఆయన ఇలా వ్యవహరించారని, మెజారిటీ సభ్యుల నుంచి బిల్లుపై వ్యతిరేకాభిప్రాయం రాకుండా చేయడానికే ఇలా చేశారని బాహాటంగానే విన్పిస్తోంది.
 
సమైక్య తీర్మానానికి సహకరించని సీఎం, చివరకు బిల్లును వ్యతిరేకిస్తూ మెజారిటీ సభ్యులు అభిప్రాయం చెప్పేందుకు ఉన్న అవకాశాలకు కూడా గండికొట్టారంటూ విమర్శిస్తున్నారు. తన నోటీసుపై తీర్మానం కోసం పట్టుబట్టాల్సి ఉన్నా కిరణ్ బీఏసీకి రాలేదు. మూడు రోజులుగా సభలోకీ అడుగు పెట్టలేదు. బుధవారం మీడియాను తన చాంబర్‌కు పిలిచి, బిల్లు అసమగ్రమైనదని, తన నోటీసుపై తీర్మానం కోసం స్పీకర్‌ను అడుగుతానని చెప్పుకొచ్చారు. సభలో తీర్మానానికి, ఓటింగ్‌కు ఆస్కారం లేకుండా గందరగోళం తలెత్తాలనే అలా మాట్లాడారంటున్నారు.
మరిన్ని వార్తలు