ఆకలవుతోంది.. లేమ్మా..!

2 Feb, 2014 03:48 IST|Sakshi

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: చందమామ కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తేనే కాని తినసి పసి కూనలు వారు. ఈ ఐదుగురికి అమ్మే ప్రపంచం. అయితే ఆ అమ్మ ఇకలేదని వారికి తెలియదు. ఆమె మృతదేహంపై వారు .. అమ్మా.. ఆకలవుతుంది.. అంటూ రోదిస్తుంటే స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది.  డోన్‌కు చెందిన వరలక్ష్మికి, దేవనగర్‌కు చెందిన రంగస్వామికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రంగస్వామి బీరువాల తయారీ సంస్థలో కూలీగా పని చేసేవాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానంకాగా అందరూ ఆరేళ్లలోపు చిన్నారులు. వరలక్ష్మి వీరిని అల్లారుముద్దుగా పెంచేది. అయితే మూడేళ్ల క్రితం ఆమె ఆడపడుచు లక్ష్మిదేవి మృతి చెందడంతో, ఇద్దరు కుమారులు అనాథలయ్యాయి. వీరిద్దరినీ వరలక్ష్మి అక్కున చేర్చుకొని ప్రేమాభిమానాలను పంచిపెట్టింది. బిడ్డలకు ఏలోటు లేకుండా చూసుకునేది. శుక్రవారం రాత్రి ఇంటి వ్యవహారాల్లో  వరలక్ష్మి, రంగస్వామిల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో వీరిద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
 
 తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి తొలగించారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. అయితే ఈవిషయం తెలియని చిన్నారులు లే అమ్మా.. పాలు ఇవ్వు.. ఆకలవుతుంది.. అంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.  త్రీటౌన్ సీఐ దైవప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు