నయవంచన పై నిరసన

26 Jun, 2015 02:41 IST|Sakshi

చంద్రబాబు విధానాల వల్ల రైతు పరిస్థితి దుర్భరంగా మారింది. రైతు అని చెప్పుకుంటే అప్పు పుట్టదనేంత స్థాయిలో పరిస్థితి ఉంది. చంద్రబాబు హయాంలో వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేదిగా తయారైంది. రుణమాఫీ జరగక, విత్తనాలు లేక, ఉన్న అప్పులు తీరక, కొత్త అప్పు పుట్టక రైతు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు రూ.300 బోనస్ సొమ్ము వచ్చేలా కృషి చేయాలి.
 - జ్యోతుల నెహ్రూ,  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు
 
 రైతు తిరగబడే రోజు వస్తుంది..
 స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకా రం వరికి రూ.2,522 మద్దతు ధర ఇవ్వాలి. కానీ రూ.1360 ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దీంతో రైతుకు ఉత్పత్తి వ్యయం కూడా రాని దుస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రూ.550 నుంచి రూ.వెయ్యికి మద్దతు ధర పెంచడం ద్వారా 81.8 శాతం పెంపుదల అయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 8.1 శాతం మాత్రమే పెరిగింది. వైఎస్ హయాంలో గిట్టుబాటు ధరతోపాటు క్వింటాల్‌కు 2006 నుంచి 2010 వరకూ ఏటా రూ.40 నుంచి రూ.100 వరకూ బోనస్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణాలు రద్దు చేయకపోగా వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని సొసైటీల నుంచి ఒత్తిడి తెస్తున్నారు. పరిస్థితి చూస్తే మళ్లీ క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి చేరుతోంది. పట్టిసీమ ప్రాజెక్టును ప్రజలు బద్దలుగొట్టి తిరగబడే రోజు కూడా దగ్గరలోనే ఉంది.
 - పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ
 
 నైతికత ఉంటే రాజీనామా చేయండి..
 వైఎస్‌పై అభియోగం మోపిన మరుక్షణమే 17 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరి ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన చంద్రబాబు విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఫోరెన్సిక్ నివేదికలో సైతం చంద్రబాబు స్వరమేనని వచ్చింది. రేపో మాపో ఆయనకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం నైతికత ఉన్నా టీడీపీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలి. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడ్డ చంద్రబాబు దాని నుంచి బయటపడేందుకు ఫోన్ ట్యాపింగ్ అంటూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
 - వరుపుల సుబ్బారావు,  ఎమ్మెల్యే, ప్రత్తిపాడు
 
 ‘బాబు’ను తరిమికొట్టే సమయమొచ్చింది..
 రైతును దగా చేసిన చంద్రబాబును తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు అప్పుల పాలైన రైతుల బాధలు పట్టకపోవడం హాస్యాస్పదం. చెప్పినది, చెప్పనిది చేసే గుణం వైఎస్‌లో ఉంటే, నమ్మించి మోసం చేసే నైజం చంద్రబాబుది. ఒకప్పుడు వెన్నుపోటు పొడిచి బయటకు పంపిన ఎన్టీఆర్ పేరును ఉచ్చరించనిదే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గతిలేని పరిస్థితి ఏర్పడింది.
 - జక్కంపూడి విజయలక్ష్మి, సీజీసీ సభ్యురాలు
 
 సర్కారుకు రానున్నవి గడ్డురోజులే..
 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ ఆర్డినెన్‌‌స ఆధారంగా జీవో 116 తెచ్చి 10 లక్షల ఎకరాలను బలవంతంగా సేకరించేందుకు టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది అమలు జరిగితే రైతు పరిస్థితి మరింత దుర్బరమవుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రైతు కంట కన్నీరు కారుస్తున్న సర్కార్‌కు ఇక రానున్నవన్నీ గడ్డు రోజులే.
 - పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు
 
 నమ్మించి దగా చేసిన బాబు, పవన్
 వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దుకు సంబంధించి ‘తొలి సంతకం’ చేసి మాట నిలబెట్టుకున్నారు. అదే చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ‘తొలి సంతకం’ విలువను దిగజార్చేలా ప్రవర్తించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానంటూ బీరాలు పలికిన పవన్‌కల్యాణ్ అడ్రస్ లేకుండా పోయాడు.
 - ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
 
 ప్రజల సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు
 పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్ములను స్వార్థ రాజకీయాల కోసం ఖర్చు పెడుతున్న చంద్రబాబు తీరు అత్యంత హేయం. వ్యవసాయం దండగని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు దానిని నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు.
 - రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే
 

మరిన్ని వార్తలు