రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలకం | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలకం

Published Fri, Jun 26 2015 2:44 AM

The capital structure is crucial to the brook in the Kondaveeti

తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది. కొండవీటి వాగును పరిశీలిస్తూ ఈ బృందం పర్యటన కొనసాగింది. ముందుగా ఉండవల్లి కరకట్టపై వర్కుషాపు సమీపంలోని హెడ్ రెగ్యులేటర్‌ను బృందం పరిశీలించింది. దాని పని తీరు, నీటి నిల్వ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై సింగపూర్ బృందం అధ్యయనం ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఏపీ సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు సింగపూర్ బృందంతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం చేపట్టే క్రమంలో కొండవీటి వాగు ముంపుపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. కృష్ణానదికి, కొండవీటి వాగుకు ఏకకాలంలో వరదలు సంభవించినప్పుడు కృష్ణానది నుంచి కృష్ణాయపాలెం వరకు బ్యాక్ వాటర్ వచ్చి, పైనుంచి వచ్చే కొండవీటి వాగు నీరు అక్కడ పంట పొలాలను ముంచెత్తుతోందని వివరించారు.

ఈ క్రమంలో కృష్ణాయపాలెంలో నీరు నిల్వ ఉంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. లాం ఫారం దగ్గర చెరువు తవ్వి గ్రీనరీ పార్కు ఏర్పాటు చేసి, అక్కడ కూడా నీరు నిల్వ చేయాల్సి ఉందన్నారు. దీంతోపాటు నీరుకొండ ప్రాంతంలో మరొక నీటి నిల్వ భాగాన్ని ఏర్పాటు చేసి, ఎగువ ప్రాంతానికి నీరు పంపించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేసవి సమయంలో కృష్ణానది నుంచి కృష్ణాయపాలెంలోకి నీటిని వెనక్కు మళ్లించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సింగపూర్ బృందంతో చర్చించారు.

కొండవీటి వాగు మలుపులు ఎక్కువగా ఉన్నాయని, ఆ మలుపులను కట్ చేయాల్సి ఉందన్నారు. కొండవీటి వాగు ముంపు నుంచి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించారు. రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలక పాత్ర పోషించడమే కాక, భవిష్యత్తు అవసరాలకు ప్రధాన వనరుగా నిలపాల్సిన అవసరం ఉందనే అంశాన్ని సింగ్‌పూర్ బృందం, అధికారులు చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే రాజధాని నిర్మాణం అనంతరం వచ్చే మురుగును ఎటువైపు మళ్లించాలనే దానిపై కూడా చర్చించారు.

కొండవీటి వాగు నీటిని రాజధాని అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తే మురుగునీటిని కృష్ణానదిలో కలపకుండా వేరే మార్గాన్ని అన్వేషణ చేయాలని నిర్థారణకు వచ్చారు. ఈ పర్యటనలో ఏపీ సీఆర్‌డీఏ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రేమ్‌కుమార్, ప్రణాళిక అధికారి నాగేశ్వరరావు, 12 మంది ఉన్న ఈ సింగపూర్ బృందంలో స్ట్రాటజిక్ అడ్వైజర్ వాంగ్‌కాయి యంగ్, అసిస్టెంట్ డెరైక్టర్ సీఎల్‌సీ జేమ్స్ టే, సైమన్‌టాంగ్, సుబానా తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement