భూమన.. మరోసారి స్వామి సేవకు

20 Sep, 2019 09:43 IST|Sakshi

సాక్షి,తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి మరోసారి శ్రీవారికి సేవ చేసే అవకాశం లభించింది. ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. భూమనతో పాటు మరో ఆరుగురికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూమన కరుణాకరరెడ్డి తుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్నారు.

ఆ తరువాత టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీవేంకటేశ్వర కల్యాణోత్సవాలు, దళిత గోవిందం వంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టారు. టీటీడీ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తెలియజెప్పేందుకు ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించారు. తాళ్లపాక అన్నమాచార్యుని 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత భూమనకే దక్కింది. టీటీడీ ఏర్పడి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సమయంలో భూమన కరుణాకరరెడ్డి చైర్మన్‌గా ఉన్నారు.

ఆ సమయంలో టీటీడీ వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణమస్తు సామూహిక వివాహాలు నిర్వహించారు. వధూవరులకు బంగారు తాళిబొట్లు ఇచ్చి ‘గోవిందుడు అందరివాడేలే’ అని చాటి చెప్పారు. ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తెలుగు సంస్కృతి వికాస వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. శ్రీనివాసంలో రచయితలకు టీటీడీ గదులు కేటాయిస్తే అందుకు సంబంధించిన మొత్తం అద్దెను  తన సొంత నిధులు చెల్లించి మన్ననలు పొందారు. ఇలా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి మరోసారి స్వామివారి సేవ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం గమనార్హం.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా