ప్రభుత్వ నిర్ణయం దారుణం: బొప్పరాజు

29 Jul, 2017 09:57 IST|Sakshi
ప్రభుత్వ నిర్ణయం దారుణం: బొప్పరాజు

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఇపుడు 50 ఏళ్లకే ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతల నుంచి బలవంతంగా రిటైర్‌ చేయించే నిర్ణయాన్ని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం దారుణమైందని, ఇప్పటికే ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు.

పదిమంది పనిని ఒక్క ఉద్యోగి చేస్తున్నారని, అలాంటప్పుడు పనితీరును ఎలా లెక్కగడతారని బొప్పరాజు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఇప్పటికే సీఎంవోకు ఫిర్యాదు చేశామని, ఉద్యోగ సంఘాలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవద్దని కోరామన్నారు. సర్కార్‌ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని బొప్పరాజు పేర్కొన్నారు.

కాగా ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు బలవంతంగా రిటైర్‌ చేయించేందుకు వీలుగా నిబంధనలన్నీ మార్చుతూ అందుకు అనుగుణంగా ఐదు జీవోలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం పొంది సీఎస్‌ వద్దకు చేరిన ఆ జీవోలు త్వరలో జీవం  పోసుకుని ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నాయి.

మరిన్ని వార్తలు