చెల్లెళ్లపై అన్న ఉన్మాదం

3 Mar, 2017 09:06 IST|Sakshi

► కత్తితో విచక్షణారహితంగా దాడి
► ఒక చెల్లెలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కాలయముడయ్యాడు.
మూఢాచారాలపై ఉన్న నమ్మకాన్ని తోబుట్టువులపై చూపలేకపోయాడు.
రక్తం పంచుకు పుట్టిన చిట్టి చెల్లెళ్లపై పైశాచికంగా దాడి చేశాడు.
నిట్టనిలువునా ఒకరి ప్రాణాలను తోడేసి.. మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు.  
అనుబంధాలను సమాధి చేసిన ఈ ఘటన తుళ్లూరుతో పాటు రాజధాని గ్రామాలను ఉలికిపాటుకు గురి చేసింది.  


తుళ్లూరు:  రాజధాని నడిబొడ్డున తుళ్లూరులోని కొత్తూరులో గురువారం రాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఓ అన్న విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో పెద్ద చెల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న చెల్లి మృత్యువుతో పోరాడుతోంది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రంజాన్‌బీ తెలిపిన కథనం ప్రకారం...కొత్తూరుకు చెందిన మొగలా, అనీషాలకు నాగూల్‌మీరా, లాల్‌బీ, రంజాన్‌బీ కన్న బిడ్డలు. లాల్‌బీకి మతి స్థిమితం లేదు. దీంతో బిడ్డలను భర్తను వదిలి కొన్నేళ్లుగా పుట్టింట్లోనే ఉంటుంది. రంజాన్‌బీ కూడా అక్కడే ఉంటుంది.

ఈ నేపథ్యంలో మతి స్థిమితం లేని చెల్లి లాల్‌బీకి చేతబడి శక్తులు ఉన్నాయని ఇరుగు, పొరుగు చెబుతుండడంతో అన్న నాగుల్‌మీరా నమ్మాడు. తరచూ పద్ధతి మార్చుకోవాలని లాల్‌బీని హెచ్చరిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇటీవల నాగుల్‌మీరాకు ఆరోగ్యం బాగోకపోవడంతో లాల్‌బీ చేతబడి చేసి ఉంటుందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంటికి రావడంతోనే కత్తితో దాడి చేసి లాల్‌బీని నరికేశాడు. అడ్డు వెళ్లిన రంజాన్‌బీపై కూడా కత్తితో దాడి చేశాడు. నాన్న మొగలాను కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అంతా స్పృహ కోల్పోయాక, చనిపోయారని భావించి వెళ్లిపోయాడు. కొత్తూరులో జరిగిన హత్యకు సంబంధించి తుళ్లూరు సీఐ సుధాకరరావు, ఎస్‌ఐ షేక్‌ షఫీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి షేక్‌ అనీషాను వివరాలు అడిగి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను అమరావతి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మరిన్ని వార్తలు