ఒక్క టికెట్‌తో తిరుమలేశుడి చెంతకు!

19 Apr, 2018 02:50 IST|Sakshi

     తిరుపతి నుంచి బస్సు టికెట్‌ కొనాల్సిన పనే లేదు..

     రైలు టికెట్‌లోనే తిరుమల వరకు బస్సు టికెట్‌ జారీ 

     వెంకన్న భక్తులకు రైల్వే వెసులుబాటు.. కొద్దిరోజుల కిందే ప్రారంభం 

     అలాగే రైళ్లలోనే తిరుమలకు బస్సు టికెట్‌ అమ్మకాలు 

     అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్న భక్తులు

సాక్షి, హైదరాబాద్‌: తిరుమలకు రైల్లో వెళ్లే భక్తులు తిరుపతిలో దిగి అక్కడి నుంచి బస్టాండుకు వెళ్లి బస్సు టికెట్‌ కొనుక్కుని కొండపైకి చేరుకుంటారు. కానీ.. ప్రత్యేకంగా బస్సు టికెట్‌ కొనుక్కొనే అవసరం లేకుండా రైలు టికెట్‌లోనే బస్సు టికెట్‌ కలసి ఉండే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా కొనని వారు కూడా రైలులో ప్రయాణిస్తున్నప్పుడే బస్సు టికెట్‌ కొనే విధానాన్ని కూడా రైల్వే ప్రారంభించింది. వెరసి.. బస్సు టికెట్‌ కోసం విడిగా కసరత్తు చేయాల్సిన అవసరం లేకుండా భక్తులకు పని తగ్గించింది. కొద్ది రోజుల క్రితమే ఈ రెండు విధానాలు ప్రారంభించినా.. వీటిపై భక్తులకు అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు.
 
హైదరాబాద్‌ నుంచి వెళ్లే అన్ని రైళ్లలో... 
హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి, నారాయణాద్రి, రాయలసీమ, సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్, పద్మావతి... ఇలా అన్ని రైళ్లలో రైలు టికెట్‌లోనే బస్సు టికెట్‌ కలసి ఉండే కాంబో విధానం అమలులో ఉంది. టికెట్‌ బుక్‌ చేసుకునేప్పుడు తిరుమల వరకు కొనాలి. ఉదాహరణకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లే వారు కాచిగూడ నుంచి తిరుమల వరకు టికెట్‌ కొనాలి. తిరుపతిలోనే రైలు దిగినా టికెట్‌పై మాత్రం తిరుమల వరకు ప్రయాణిస్తున్నట్టుగా జారీ అవుతుంది. ఆ టికెట్‌ను అలిపిరి వద్ద చెక్‌ చేసే సమయంలో ఆర్టీసీ సిబ్బందికి చూపితే దాన్ని తీసుకుని ఆర్టీసీ టికెట్‌ ఇస్తారు. ప్రత్యేకంగా తిరుపతిలో క్యూలో నిలబడి బస్‌ టికెట్‌ కొనాల్సిన బాధ తప్పుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో తిరుపతిలో బస్‌ టికెట్‌ కొనటం కూడా గగనమే అవుతోంది. ఆ బాధ లేకుండా రైలు టికెట్‌తోపాటే బస్‌టికెట్‌ కొనుక్కునే వెసులుబాటును రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అయితే త్వరలోనే ప్రత్యామ్నాయ విధానం ఖరారు చేసి అందుబాటులోకి తేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
 
రైలులోనే బస్‌ కండక్టర్లు... 
ఇక హైదరాబాద్‌ నుంచి వెళ్లే రైళ్లలో రేణిగుంటకు చేరువకు రాగానే బస్‌ కండక్టర్లే రైళ్లలోకి వస్తారు. వారు అక్కడికక్కడే తిరుమల టికెట్లు జారీ చేస్తారు. ఇందుకోసం ఇటీవల ఏపీఎస్‌ ఆర్టీసీ–రైల్వేలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కడప మార్గంలో వెళ్లే రైళ్లలో కోడూరు వద్ద ఆర్టీసీ కండక్టర్లు రైళ్లలోకి ఎక్కుతారు. గూడూరు మార్గంలో వచ్చే వాటిల్లోకి కాళహస్తి వద్ద ఎక్కుతారు. వారి నుంచి అప్పటికప్పుడు తిరుమలకు అప్‌ అండ్‌ డౌన్‌ టికెట్లు కొనుక్కోవచ్చు.

దిగిన తర్వాత హైరానా పడాల్సిన అవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి వెళ్లే కాచిగూడ–తిరుపతి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్‌–తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు చెన్నై నుంచి వచ్చే సప్తగిరి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు–బెంగళూరు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, కాకినాడ నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–తిరుపతి ఎక్స్‌ప్రెస్, మన్నార్‌గుడి ఎక్స్‌ప్రెస్, కొల్హాపూ ర్‌ నుంచి వచ్చే హరిప్రియ ఎక్స్‌ప్రెస్, మైసూ రు నుంచి వచ్చే గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో దీన్ని ప్రారంభించారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో మరిన్ని రైళ్లల్లో పారంభించనున్నట్టు ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు