చిచ్చు పెట్టి.. ఆత్మగౌరవ యాత్రలా?: బీవీ రాఘవులు

23 Aug, 2013 04:19 IST|Sakshi

అనంతపురం, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనకు అనుకూలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ ఇస్తే.. సీమాంధ్రలో ఆ పార్టీ నాయకులు సమైక్య ఉద్యమాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మండిపడ్డారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు-సీపీఎం వైఖరి’ అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇరు ప్రాంత ప్రజలను విడగొట్టాలని లేఖ ఇచ్చి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారో చెప్పాలన్నారు. ఆత్మగౌరవం కాదు తెలుగు ప్రజల వైరుధ్య యాత్ర చేపట్టాలని సూచించారు.
 
 తెలంగాణ ఉద్యమాలను ఏమంటారు?
 సీమాంధ్రలో జరుగుతున్నవి రాజకీయ ఉద్యమాలైతే తెలంగాణలో జరిగిన ఉద్యమాలను ఏమంటారో చెప్పాలని తెలంగాణ నాయకులను బీవీ రాఘవులు ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారని.. అయితే కొందరు తెలంగాణ ప్రాంత నాయకులు వాటిని రాజకీయ నాయకులు ఉసిగొల్పి చేయిస్తున్నారని విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో చేపట్టిన ఉద్యమాలు కూడా అదే కోవకు చెందినవా అని ప్రశ్నించారు. విభజన పాపం కాంగ్రెస్‌దేనని చెప్పారు. తెలంగాణ ప్రాంత ఓట్లు, ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు విచ్ఛిన్నమైతే ప్రజాస్వామ్యానికి ముప్పు అని  ఆందోళన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు