జిల్లాలో ఉద్యోగానందం..

22 Sep, 2019 10:19 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

జిల్లాలో 7,814 మందికి కొలువులు

23 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల పరిశీలన

పీఆర్‌ డిప్యూటీ కమిషనర్, ఇన్‌చార్జి సీఈఓ

పల్లెల్లో కొలువుల కోలాహలం, నిరుద్యోగుల కళ్లల్లో ఉద్యోగానందం కనిపిస్తోంది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ‘కొలువు’దీరనున్నారు. పట్టభద్రులై పట్టాలు చేతబట్టుకుని ఉద్యోగ వేట సాగించిన ఎంతో మంది నిరుద్యోగులు ఎన్నాళ్లో వేచిన ఉదయం సాక్షాత్కరించనుంది. ఇప్పటికే పల్లె కొలువులకు రాసిన రాత పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. శనివారం రాత్రి ఎవరు ఏ ఉద్యోగానికి ఎంపికయ్యారో వెబ్‌సైట్లో ప్రభుత్వం పొందుపరిచింది. రేపటి నుంచి అభ్యర్థుల అర్హతల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. ఆఖరి ఘట్టం ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉద్యోగార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

సాక్షి, నెల్లూరు(పొగతోట): గ్రామ సచివాలయ ఉద్యోగుల మెరిట్‌ జాబితా సిద్ధం అయింది. ఈ మేరకు 1:1 నిష్పత్తిలో 7,814 మంది మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు. సోమవారం నుంచి అభ్యర్థుల అర్హతల సర్టిఫికెట్లు పరిశీలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుశీల, ఇన్‌చార్జి జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి శనివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విలేరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. 1.27 లక్షల మంది అభ్యర్థులు సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారన్నారు. శాఖల వారీగా 7,814 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు.

ఎంపికైన అభ్యర్థులు ఎస్‌ఎంఎస్, మెయిల్‌ ద్వారా సమాచారం వచ్చిన తర్వాత నెట్‌ సెంటర్‌లో వారికి సంబంధించిన సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసి ప్రింట్‌ తీసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అభ్యర్థులకు కేటాయించిన తేదీల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. నగరంలో పీఎన్‌ఎం హైస్కూల్‌ జెండావీధి, సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల, నూతన ఎస్‌పీ ఆఫీస్, డీకేడబ్ల్యూ, సర్వోదయ, వీఆర్‌ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. ఈ నెల 27వ తేదీన మెరిట్, రోస్టర్‌ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో సచివాలయంలో చేయాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

మెరిట్‌ జాబితా కోసం కసరత్తు 
గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర అధికారులు మెరిట్‌ జాబితాను జిల్లా యంత్రాంగానికి పంపించారు. జిల్లాకు వచ్చిన మెరిట్‌ జాబితాను ఇన్‌చార్జి జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి 19 శాఖల వారీగా కేటాయించారు. ఆ మేరకు అధికారులు మెరిట్‌ జాబితాను సిద్ధం చేశారు. రోస్టర్‌ ప్రకారం అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది. రోస్టర్‌ ప్రకారం మెరిట్‌ జాబితా సిద్ధం చేసే పనిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులు ఎంపికలో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

23న సర్టిఫికెట్ల పరిశీలన జరిగే శాఖలు 
ఈ నెల 23వ తేదీన పిఎన్‌ఎం హైస్కూల్‌ జెండావీధి, సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిష్‌ స్కూల్, సర్వోదయ కళాశాలలో సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌ (గ్రేడ్‌–11) 537, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్స్‌ 159, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ 3, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ 75, విలేజ్‌ పశుసంవర్థక అసిస్టెంట్‌ 625 మొత్తం 1,400 ఉద్యోగాలకు సర్టిఫికెట్ల పరిశీలన జరనుంది.

మరిన్ని వార్తలు