రాయల సీమకు తీరని అన్యాయం చేస్తున్నారు

21 Sep, 2017 01:11 IST|Sakshi
రాయల సీమకు తీరని అన్యాయం చేస్తున్నారు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుతున్నా చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు సాఫీగా సాగుతున్నాయని, ఏపీ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసిందన్నారు.

చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగా రాయలసీమ రైతాంగం తీవ్ర దుర్భిక్షంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 20 నాటికే ఆల్మట్టి నిండిపోయినా ఇప్పటికీ నీరు కిందకు వదల్లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. అదృష్టవశాత్తు వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 104 టీఎంసీల స్టోరేజ్‌కి చేరుకుందన్నారు. వర్షాలు బాగా వస్తే తప్ప ఇంకా 40 టీఎంసీలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రైతాంగాన్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కృష్ణాబోర్డు అనుమతులు తీసుకొని నీళ్లు తీసుకుంటున్నారా అని చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అని నిలదీశారు. తెలంగాణ రైతాంగాన్ని వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకించడం లేదని, రెండు రాష్ట్రాల పెద్ద మనుషులు ముఖ్యమంత్రులని గుర్తుంచుకొని సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ రివర్‌ బోర్డును అడగడం.. తెలంగాణ సర్కార్‌ అభ్యంతరాలు పెట్టడం మళ్లీ పోతిరెడ్డిపాడుకు నీటి సరఫరా నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు చట్టబద్ధంగా బోర్డును కోరలేదని తెలిసిపోతుందన్నారు. ఓటుకు కోట్ల కేసు తిరగతోడుతారోనని భయపడుతున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. దయచేసి దుర్భిక్షంలో ఉన్న రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని, కృష్ణా రివర్‌బోర్డు అనుమతులు తీసుకొని నీటి సరఫరా చేయాలని కోరారు.