ఏడాది పొడవునా వేడుకలు: సీఎం

30 Oct, 2016 04:37 IST|Sakshi
ఏడాది పొడవునా వేడుకలు: సీఎం

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలన్న ఆకాంక్షతో రాష్ట్రంలో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శనివారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద నరకాసుర వధ కార్యక్రమంతోపాటు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలకు సతీసమేతంగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర సంగమానికి అఖండ హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం విల్లు ఎక్కుపెట్టి నారిని సంధించి నరకాసురుడి ప్రతిమను వధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర సంగమం వద్ద దీపావళి సంబరాలు జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. భవిష్యత్తులో ఈ పవిత్ర సంగమం వద్ద రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి దీపావళి జరుపుకోవాలని చెప్పారు.

అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కు ఆదరణ
ఆనందభరిత వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించామని చంద్రబాబు అన్నారు. 300 మందికిపైగా వ్యాపారులు ఉత్సాహంగా స్టాళ్లు ఏర్పాటు చేశారని, ప్రజల ఆదరణతో దాదాపు రూ.11 కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. సభ అనంతరం అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు