కుటుంబంతో కలపాలని..

4 Jan, 2020 08:34 IST|Sakshi
శివశంకరయ్యను పరీక్షిస్తున్న వైద్యులు

వారధిగా నిలుస్తున్న ‘సాక్షి’

వృద్ధుడి ఆపరేషన్‌కు చేయూత

స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, పోలీసుల సహకారం

బాధ్యతను విస్మరించి కుటుంబాన్ని గాలికి వదిలేసి ఊరూరా తిరిగి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివశంకరయ్య తాను చేసిన తప్పును జీవిత చరమాంకంలో తెలుసుకుని కుమిలిపోతున్నాడు. ఇతనికి వైద్యసేవలందింజేసి, చివరి క్షణాల్లోనైనా సంతోషంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిపేందుకు ‘అంపశయ్యపై నాన్న’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వైద్యులు, పోలీసులు కూడా తమవంతు సహకారమందిస్తున్నారు.

హిందూపురం: వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం మాసాపేటకు చెందిన శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చక్కెరవ్యాధిగ్రస్తుడైన ఇతడు కుటుంబాన్ని వదిలి ఊరూరా తిరుగుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. ప్రస్తుతం గాంగ్రిన్‌తో బాధపడుతున్నాడు. ఎడమకాలు పాదం పూర్తిగా కుళ్లిపోయింది. నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. పాదంలో ఏర్పడిన పుండు (గాంగ్రిన్‌)ను అలాగే వదిలేస్తే శరీరమంతా పాకి ప్రాణాపాయస్థితికి చేరుకునే ప్రమాదముంది. తనలాంటి దుస్థితి ఏ తండ్రికీ రాకూడదని, తాను చేసిన తప్పులకు దేవుడే శిక్ష విధించాడని పశ్చాత్తాపపడుతున్నాడు. 

సపర్యలు చేస్తున్నస్వచ్ఛంద సంస్థ సభ్యులు  
వృద్ధుడి దీన స్థితిని చూసి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సపర్యలు చేస్తున్నారు. రోజూ ఉదయాన్నే అతనికి పాలు, అల్పాహారం, మధ్యాహ్నం మజ్జిగ అందిస్తున్నారు. దుర్వాసన వస్తున్న దుస్తులను మార్చి అవసరమైన సేవలందిస్తున్నారు. అతనికి వైద్యసేవలు పూర్తిగా అందించి కుటుంబానికి అప్పగించడానికి చేయూత అందిస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముస్లిం నగరా కన్వీనర్‌ ఉమర్‌ఫరూక్‌ అంటున్నారు. ఇతను చేసింది క్షమించరాని తప్పేనని, అయితే మరణానికి చేరువలో ఉన్న క్షణంలో జన్మనిచ్చిన తండ్రికి, కట్టుకున్న భర్తకు ఎంతో కొంత అతని రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని వారి కుటుంబసభ్యులను కోరారు.

మానవత్వంతో ఆపరేషన్‌కు ఏర్పాట్లు
శివశంకరయ్య ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. డయాబెటిక్‌ విత్‌ గాంగ్రిన్‌ వ్యాధి ఇది. ఇలాగే వదిలేస్తే శరీరమంతా పాకి ప్రాణానికే ప్రమాదమని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేశవులు, సర్జన్లు డాక్టర్‌ శివప్రసాద్‌నాయక్, డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడులు చెప్పారు. అంతేగాక ఇతనికీ, బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉన్నాయని, ఆహారం సరిగా తీసుకోని కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయిందని, మరింత ఆలస్యం చేస్తే మరణించవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం ఇతని పరిíస్థితి చూసి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు రావడంతో మానవతాదృక్పతంతో ఆపరేషన్‌ చేసి.. చెడిపోయిన వరకు కాలు తీసేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయమై ఇతని కొడుకు కోసం ప్రయత్నం చేసినా అతను అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. రేపటిలోగా అన్ని లెవల్స్‌ కంట్రోల్‌ చేసి ఆపరేషన్‌ చేస్తామని చెప్పారు. ఉన్న కొన్నిరోజులైనా కుటుంబ సభ్యులు చూసుకోవాలని కోరుతున్నామన్నారు. శివశంకరయ్య చేసిన తప్పులకు ఇప్పటికే చాలా అనుభవించేశాడని,  కొడుకు పెద్దమనస్సుతో క్షమించి కన్నరుణం తీర్చుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు