మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లకు గాలం..

4 Jan, 2020 08:31 IST|Sakshi

మున్సిపాలిటీల్లో ప్రలోభాల పర్వం షూరూ

ద్వితీయ స్థాయి శ్రేణులకు బాధ్యతలు అప్పగింత 

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: పురపోరు వేడి మున్సిపాలిటీల్లో రాజుకుంది. ఇప్పటికే టికెట్‌ వచ్చిన అభ్యర్థులు, టిక్కెట్‌ వస్తోందని ఎదురుచూస్తున్న ఆశవాహులు అందరూ ప్రచారాల్లో బీజీ బీజీగా తిరుగుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్ది నాయకులు అంచెలంచెల వ్యూహాలతో ఆయా పార్టీల అభ్యర్థులు పంపకాల పర్వానికి తెరతీస్తారు. ప్రలోబాలే ఓటు బలంగా భావిస్తూ నోటుకు ఓటు సూత్రాన్ని అమలు చేస్తారు. ఓటు బలాన్ని నోటు బలహీనతతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధం కానున్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో అయితే ఒక అడుగు ముందే ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అంతా ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలి అనే దాంట్లో బీజీగా ఉన్నారు. ఇక చివరి రోజుల్లో ఓటర్ల చెంతకు నోట్లను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ముందస్తుగానే నగదును ఆయా  వార్డులకు చేర్చే పనిలో పడ్డారు. 

నమ్మకమైన ఓటర్లకే పంపకాలు 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక్ష దైవంగా భావించడం పరిపాటి. ఏ పుట్టలో  ఏ పాముందో అదే మనకు బలంగా మారుతుందో అంటూ అందరిని ప్రసన్నం చేసుకోవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తమ ఓటు వీళ్లని నమ్మిన వాళ్లకే డబ్బు చెల్లిస్తున్నారు. సర్వేలతో రెండు పార్టీల నాయకుల ఆయా బూత్‌ల వారీగా నిర్దరించుకున్నారు. ఆమేరకు మాత్రమే డబ్బు అందజేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.

భారీగా మద్యం నిల్వలు
ఈ ధపా ఎన్నికల్లో ఓటర్లను వశం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గత నెల పాత మద్యం దుకాణాలకు చివరి రోజులు కావడంతో వారి దగ్గర మిగిలిపోయిన మద్యాన్ని ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు సమాచారం. ఒకవైపు మద్యం అమ్మకాలు, తరలింపుపై భారీ స్థాయిలో నిఘా ఉండవచ్చని భావించే ఒక నెల రోజుల ముందుగానే కీలక అభ్యర్థులు భారీ స్థాయి రహస్య ప్రాంతాల్లో స్టాక్‌ చేసి పెట్టుకున్నారు.

ఎన్నికలు ఇంకా రెండు రోజుల వ్యవధి ఉన్న సమయంలో ఓటర్ల చెంతకు మద్యం చేర్చుతారు. కొందరు అభ్యర్థులు మద్యం ఓటర్లకు ఇవ్వడానికి అనుచరగణానికి చీటిలను పంపిణీ చేయాలని చూస్తే.. మరి కొందరు టోకన్లు జారీ చేయాలని చూస్తున్నారు. మరి కొందరు నేరుగా ఇంటింటికి తిరిగి మద్యం బాటిల్స్‌ అందజేయాలని ప్లాన్‌ వేసుకుంటున్నారు. దీంట్లో యువత కీలక పాత్ర వహిస్తున్నారు బృందాలు ఏర్పడి ఆయా వార్డులలో ద్విచక్ర వాహనాల సాయంతో మద్యం తరలించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.   

మరిన్ని వార్తలు