మా ప్రశ్న.. మీ సమాధానం..!

4 Nov, 2017 06:38 IST|Sakshi

ప్రజల ఆలోచనల్లో మార్పు కోసం చిత్తూరు పోలీసుల వినూత్న యాప్‌

సానుకూల దృక్పథమే లక్ష్యం

చిత్తూరు అర్బన్‌: ‘‘మీరు ఓ వ్యక్తిని ప్రేమిం చారు. అతడు మిమ్మల్ని మోసం చేశాడు. పోలీసుల్ని ఆశ్రయిస్తారా..? అఘాయిత్యం చేసుకుంటారా..?’’
‘‘ ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారా..? నీ కర్మ అంటూ వదిలేస్తారా..?
ఇలాంటి ప్రశ్నలకు ఎంతటి వారైనా పాజిటివ్‌ కోణంలోనే సమాధానాలిస్తారు. ఇలా సానుకూల దృక్పథంతో సమాధానాలు ఇచ్చే వారి ఆలోచన తీరులో తప్పకుండా మార్పు వచ్చే తీరుతుంది. ఈ దిశగా వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చి వ్యవస్థను బాగు చేయడానికి చిత్తూరు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.

ఆలోచనల్లో మార్పు..
జిల్లాలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. వీటిపై విద్యావంతులైన యువతలో మార్పు తీసుకురావడానికి చిత్తూరు పోలీసు యంత్రాంగం వినూత్నంగా ఆలోచించింది. అందరికీ తెలిసిన ప్రశ్నలకు సానుకూల సమాధానాలు వచ్చేలా కొన్ని ప్రశ్నలు రూపొంది స్తోంది. ఏ, బీ అనే రెండు ఆప్షన్లు పెడుతున్నారు. ఒకటి ప్రతికూల సమాధానం, మరొకటి సానుకూల  సమాధానాన్ని సూచిస్తుంది. ఎంతటివారైనా ఇలాంటి సమాధానాలకు పాజిటివ్‌గానే స్పందిస్తారు. పాజిటివ్‌ను ఆచరణలో పెట్టలేని వారు సైతం ఒపీనియన్‌ పోల్‌కు వచ్చేసరికి కచ్చితంగా సానుకూల సమాధానమే ఇస్తారు. ఇలా సమాధానాలిచ్చి న వ్యక్తి ఆలోచనలో కాలక్రమేనా తప్పకుండా మార్పు వస్తుంది.

ఫలితంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని గుర్తించిన చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఇలాంటి ప్రశ్నలను రూపొం దించి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా యువతకు, మహిళలకు లింక్‌ ద్వారా పంపిస్తూ సమాధానాలు రాబడుతారు. తర్వాత ఎంత శాతం మంది ఏ సమాధానాలను సమర్థించారో తెలియజేస్తారు. దీనిద్వారా మహిళలపై నేరాల శాతం తగ్గించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించినట్లు అవుతుందని భావిస్తున్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు దీన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఎస్పీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు