పరిశ్రమాంధ్ర

29 May, 2020 04:17 IST|Sakshi

పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక రంగంపై మేధోమథన సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూరుస్తాం

జాప్యం లేకుండా సింగిల్‌ విండోలో అనుమతులిస్తాం

గత ప్రభుత్వం పారిశ్రామిక రాయితీలు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టింది

డిస్కమ్‌లకు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టింది

గత సర్కారు ఎంఎస్‌ఎంఈలకు బకాయిపడ్డ రూ.968 కోట్లను మా ప్రభుత్వం  చెల్లిస్తోంది

ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం

దేశంలో ప్రముఖ నగరాలతో పోటీపడే సత్తా విశాఖకే ఉంది

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌: గత సర్కారు మాదిరిగా అవాస్తవాలు, లేనివి ప్రచారం చేయడం, గ్రాఫిక్స్‌ చూపించి అన్యాయం చేయడం మాకు సాధ్యం కాదు. రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోయిందని మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన మీడియా దుష్ప్రచారం చేసింది. మైక్రోసాఫ్ట్‌ వస్తోందని, బుల్లెట్‌ రైలు వస్తోందని, రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ గత ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేసింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ అంటూ గ్రాఫిక్స్‌ చూపించింది. అలాంటి అవాస్తవాలను మా ప్రభుత్వం ప్రచారం చేయదు.

సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ ఎంతో అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 972 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు నాలుగు పోర్టులు, ఆరు విమానాశ్రయాలున్నాయని మంచి రహదారులు, రైల్వే లైన్లు మన బలమని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి భూమి, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతులతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. డిప్లొమా, ఇంజనీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యం పెంచేలా ఈ కేంద్రాలు పని చేస్తాయన్నారు.

టెక్స్‌టైల్స్‌ రంగానికి గత సర్కారు రూ.1,100 కోట్లు బకాయిలు పెట్టిందని, వాటిపై కూడా త్వరలో షెడ్యూల్‌ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. గత సర్కారు కేంద్రంతో కలసి కాపురం చేసినా ప్రత్యేక హోదా తేలేదని, ఎప్పటికైనా హోదా సాధిస్తాననే నమ్మకం తమకు ఉందని సీఎం అన్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే సత్తా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖకే ఉందన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో పారిశ్రామిక రంగం–మౌలిక సదుపాయాలపై మేధోమ«థన సదస్సు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగం వివరాలివీ..

విభజనతో చాలా నష్టపోయాం
మన ఆర్థిక రథం నడవాలంటే వ్యవసాయం ఒక చక్రం అయితే, రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగం. వాటిలో అభివృద్ధి కనిపిస్తేనే ఆర్థిక రథం పరుగెత్తుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయింది. రాష్ట్రాన్ని  విడగొట్టినప్పుడు హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వలేదు. దీనివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పారిశ్రామికంగా పలు రాయితీలు ఇన్‌కమ్‌ట్యాక్స్, జీఎస్టీ లాంటి రాయితీలు వచ్చేవి. వాటివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి.

హోదాను ఎప్పటికైనా సాధిస్తాం
2014–19 వరకు కేంద్రంతో కలసి కాపురం చేసినా గత ప్రభుత్వం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీ సాధించింది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకవేళ కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకుండా ఉండి ఉంటే వాళ్లతో బేరం పెట్టే అవకాశం ఉండేది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో వారు మా మద్దతు కోరే అవకాశమే లేకుండా పోయింది.

గత సర్కారులా అసత్యాలు చెప్పం
మనం ఏదైనా చెప్పేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగానే మేం కూడా రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని మాట్లాడితే అర్ధం లేదు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి, 40 లక్షల ఉద్యోగాలు అని ఒకరోజు. నెలకో విదేశీ కంపెనీ అంటూ హడావుడి, రూ.50 వేల కోట్లతో సెమీ కండక్టర్‌ పార్కు, బుల్లెట్‌ రైలు వస్తుందని ఒకరోజు, ఎయిర్‌బస్‌ వచ్చేస్తుందని ఇంకోరోజు, మైక్రోసాఫ్ట్‌ వచ్చేస్తోందని మరొక రోజు, హైపర్‌ లూప్‌ వస్తుందని ఇంకొక రోజు ప్రచారం.. ఇవన్నీ సరిపోవని ఈ మధ్యనే దివాలా తీసిన బీఆర్‌ «శెట్టి ఈ పక్కనే 1,500 పడకలతో రూ.6 వేల కోట్లతో దిగుతున్నాడని చెప్పారు. ఇవన్నీ నేను కూడా చెబితే అర్ధం ఉండదు.

అదేనా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’?
గత ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని చెప్పేది. 2014 – 2019 వరకు పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. వాటిలో దాదాపు రూ.968 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు ఇవ్వాల్సినవి. పరిశ్రమలు పెట్టించిన తర్వాత రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే ఏమిటి? ఇక్కడ అంతా బాగుందని ఎలా చెబుతాం? గతంలో పారిశ్రామిక రాయితీలు కూడా అమ్ముకున్నారు. ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టచెబితే తప్ప రాయితీలు ఇచ్చేవారు కాదు.

అలా నేను చెప్పలేను..
డిస్కమ్‌లకు కూడా గత ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్లు బకాయి పెట్టింది. ఇదేనా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌? ఏటా క్రమం తప్పకుండా దావోస్‌ వెళ్లారు. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలు, చెప్పిందే చెప్పారు కానీ ఏమీ సాధించలేదు. అన్నీ అబద్ధాలు చెప్పారు. మీడియా వారికి అనుకూలంగా  ఉండడం వల్ల అలా అబద్ధాలు చెబుతూ పోయారు. అవన్నీ నేను చెప్పలేను. పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేది ఒక్కటే. చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. నిజాయితీ, నిబద్ధత మాలో ఉన్నాయి.

మాది 4వ అతి పెద్ద పార్టీ
175 సీట్లకు గానూ 151 సీట్లు, 86 శాతం స్థానాలను గెల్చుకుని రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. ప్రో యాక్టివ్‌గా ఉన్నాం. 22 ఎంపీ స్థానాలను గెల్చి దేశంలోనే 4వ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్‌సీపీ నిలిచింది. అవినీతికి తావే లేదు ఇక్కడ ఎవరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడా అవినీతికి తావు లేదు. వ్యవస్థలో మార్పు తెస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్యుడిషియల్‌ ప్రివ్యూ కోసం కమిషన్‌ కూడా ఏర్పాటు చేశాం. సంస్కరణలు చేపట్టి రివర్స్‌ టెండరింగ్‌ విధానం. తెచ్చారు. టెండర్లలో ఎల్‌–1 వచ్చినా అంతకంటే ఎవరైనా తక్కువకు వస్తే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నాం. దేశంలో అత్యున్నత పోలీసు వ్యవస్థ ఏపీలో ఉంది. గ్రామ స్థాయిలో సచివాలయాల్లో మహిళా పోలీసులున్నారు. ఆ స్థాయిలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉంది. శాంతి భద్రతలకు ఢోకా లేదు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు రూ.లక్ష  కోట్ల విలువైన చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీతోపాటు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేశాం.

మెరుగైన మౌలిక సదుపాయాలు
రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ ఉంది. అవసరాలకు తగినట్లుగా పారిశ్రామికవేత్తలకు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగు, సాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం వాటర్‌ గ్రిడ్స్, కాలువల నుంచి ఢోకా లేకుండా నీరు ఇచ్చేవిధంగా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం.

పదేళ్లలో అద్భుతమైన మానవ వనరులు..
► ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో తెలుగు తప్పనిసరి సబ్జెక్‌గా ఉంటుంది. దీనివల్ల వచ్చే 10 ఏళ్లలో సేవా రంగానికి అద్భుతమైన మానవ వనరులు అందించే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తుందని గర్వంగా చెప్పగలుగుతా.
► గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌)లో కూడా మన స్థానం మారుతుంది. ఇంటర్‌ తర్వాత కాలేజీలో చేరుతున్న వారి నిష్పత్తి చూస్తే.. రష్యాలో 82 శాతం, చైనాలో దాదాపు 51 శాతం, బ్రెజిల్‌లో కూడా దాదాపు 51 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం అది కేవలం 26 నుంచి 28 శాతం వరకు మాత్రమే ఉంది.
► ఈ పరిస్థితి మారాలని 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం.

34 దేశాల రాయబారులను పిలిచాం..
అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర నెలలు కూడా గడవకముందే డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించి దాదాపు 34 దేశాల రాయబారులను కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఆహ్వానించాం. ఇక్కడ పెట్టుబడి అవకాశాలను వివరించాం. ఇవన్నీ చేస్తుంటే, గత సర్కారు పెద్దమనుషులు, వారి అనుకూల మీడియా దుష్ప్రచారం చేసింది. కియా మోటర్స్‌ వెళ్లిపోతోందని  ప్రచారం చేశారు. అప్పుడు కియా మోటర్స్‌ ఎండీ స్పందించి ఇక్కడ ఇంత సానుకూలంగా ఉంటే ఎందుకు వెళ్లిపోతామని లేఖ ఇచ్చారు.

పరిశ్రమలు–పెట్టుబడులు–ఉద్యోగాలు
► పరిశ్రమల పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం ఉంది కాబట్టే గత ఏడాది 34,322 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి మొదలు పెట్టాయి.
► 13,122 కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్లు వచ్చాయి.  వాటి ద్వారా రూ.2503 కోట్లు పెట్టుబడి రాగా, 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కోవిడ్‌ వల్ల కాస్త మందగించినా పుంజుకుంటున్నాయి.
► ఇంకా రూ.11,548 కోట్ల పెట్టుబడికి 1,466 కంపెనీలు రెడీగా ఉన్నాయి. వాటికి ఏపీఐఐసీ 1,600 ఎకరాల భూమి కేటాయించింది. మరో 20 ప్రముఖ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ఎంఎస్‌ఎంఈలకు చేయూత
► సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో దాదాపు 98 వేల యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వాటిని కాపాడుకుంటేనే వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందుకే వైఎస్‌ఆర్‌ నవోదయం పథకం ద్వారా 81 వేల ఎంఎస్‌ఎంఈలకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగేలా బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు రెడీ చేసి అండగా నిలిచాం.
► కోవిడ్‌తో చిన్న చిన్న ఎంఎస్‌ఎంఈలు మూతబడే స్థితికి చేరుకున్నాయి. వాటికి గత ప్రభుత్వం రూ.968 కోట్ల ప్రోత్సాహక రాయితీలు బకాయి పెడితే మేం ఇస్తామని చెప్పాం. ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చాం. మిగిలిన మొత్తం కూడా జూన్‌ 29న ఇవ్వబోతున్నాం. ఇది నిజమైన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.
► ఇవే కాకుండా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పవర్‌పై ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.188 కోట్లు రద్దు చేశాం. కేంద్రం ఇచ్చేవి కూడా పంపిణీ చేసి తోడుగా ఉంటాం.ప్రభుత్వం ఇంకా వాటికి రూ.1200 కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటోంది.

పెద్ద కంపెనీలకు చాలా చేయాలి..
పెద్ద కంపెనీలకు ఇంకా ఆశించిన స్థాయిలో చేయలేకపోతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందుకోసమే సూచనలు, సలహాలు తీసుకుందామని మిమ్మల్ని ఆహ్వానించాం. ఏంచేస్తే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలలో విశ్వాసం  కలుగుతుందో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. 
మూడేళ్లలో చేయాల్సిన ప్రాజెక్టులు..
► రాష్ట్రానికి మూడేళ్లలో కొన్ని ప్రాజెక్టులు తప్పనిసరిగా చేయాల్సినవి ఉన్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు నిర్మాణం, భోగాపురంలో  అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావాలి. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కాబోతోంది. అక్కడ మెట్రో రైలు రావాలి. 
► ఇంకా 8 చోట్ల ఫిషింగ్‌ హార్బర్లతో పాటు 2.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. జాయింట్‌ వెంచర్‌కు  సిద్ధంగా ఉన్నాం. ప్లాంట్‌కు ముడి సరుకు సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం కోసం డీఆర్‌డీవోతో ఒప్పందం చేసుకున్నాం.

విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ
విశాఖలో హైఎండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. టైర్‌–1 సిటీ కాబట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో విశాఖ పోటీ పడగలుగుతుంది. అక్కడ నిపుణులైనసాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అందుబాటులోకి వస్తారు. రాబోయే రోజుల్లో అది కార్యరూపం దాల్చనుంది. సదస్సులో మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, నిపుణులు పాల్గొన్నారు. 

సదస్సులో పాల్గొన్న మంత్రులు గౌతమ్‌రెడ్డి, బొత్స, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ అధికారులు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా