మెడికల్‌ భాషలో కారణాలు చెప్పొద్దు

24 May, 2018 09:41 IST|Sakshi
హెచ్‌డీఎస్‌ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న

మాతాశిశు మరణాలపై కలెక్టర్‌ సీరియస్‌

అపోలో.. ప్రభుత్వ వైద్యులు ఇద్దరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశం

జూన్‌ 2 నుంచి అందుబాటులోకి డయాలసిస్‌

హెచ్‌డీఎస్‌లో కలెక్టర్‌ ప్రద్యుమ్న

చిత్తూరు అర్బన్‌: ‘‘గతేడాది జిల్లాలో 46 మాతాశిశు సంభవించాయి. ఈ సంవత్సరం ఐదుగురు చనిపోయారు. ఇందుకు మెడికల్‌ భాషలో మీరు చెప్పే వాటికి తలూపి వెళ్లిపోవడానికి నేను పేషెంట్‌ను కాదు. మీ పరిపాలన అధికారిని. మరణాలకు కారణాలు చెప్పొద్దు. ఎందుకు ముందే మరణాలను నివారించలేకపోయారో చెప్పండి. ఆస్పత్రిలో అపోలో యాజమాన్యం, ప్రభుత్వ వైద్యాధికారులు ఒకరికొకరు సర్దుకుని సమన్వయంతో పని చేయాలి’’ అంటూ జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి సంస్థ (హెచ్‌డీఎస్‌) సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్య సంస్థతో కలిసి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అపోలోకు క్లినికల్‌ అటాచ్‌మెంట్‌ కింద ఆస్పత్రిలో చోటు ఇచ్చిందన్నారు. మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ (ఎంఓయూ) ప్రకారం ఇక్కడ మౌలిక వసతులు, సదుపాయాలను వీలైనంత త్వరగా కల్పించా లన్నారు. డయాలసిస్‌ యంత్రాన్ని ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేద ని కలెక్టర్‌ అపోలో యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

నెలవారీ నిర్వహణపై స్పష్ట త లేదని వారు చెప్పడంతో హెచ్‌డీఎస్‌ నిధుల నుంచి నెలసరి నిర్వహణ భరిస్తామని జూన్‌ 2 నుంచి డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే చనిపోయినవారికి ఉచితంగా అంత్యక్రియలు నిర్వర్తించడానికి మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తానే ఓ వాహనాన్ని సమకూరుస్తానన్నారు. ఆగస్టు 15వ తేదీకి నిర్మాణంలో ఉన్న ఓపీ భవనం పూర్తవ్వాలన్నారు. మాతాశిశు కేంద్రంలో ఏసీలు ఉంచాలన్నారు. ఇక కోతుల బెడద లేకుండా వార్డుల చుట్టూ కమ్మీలను సైతం ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర విభాగంలో అపోలో సైతం రాత్రి వేళల్లో ఇద్దరు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు భవన నిర్మాణం సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అజెండాలోని అంశాలను కలెక్టర్‌ ఆమోదించారు. జేసీ–2 చంద్రమౌళి, డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయగౌరి, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, ఆస్పత్రి పర్యవేక్షకులు పాండురంగయ్య. అపోలో అధికారి నరేష్‌కుమార్‌రెడ్డి, హెచ్‌డీఎస్‌ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు