వారంలోపు ఆధార్ అనుసంధానం పూర్తిచేయండి : జేసీ

4 Sep, 2014 02:13 IST|Sakshi
వారంలోపు ఆధార్ అనుసంధానం పూర్తిచేయండి : జేసీ

మచిలీపట్నం : రేషన్‌కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలకు ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జేసీ జె.మురళీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రేషన్‌కార్డులు, ఎల్‌పీజీతో ఆధార్ అనుసంధానం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో రేషన్‌కార్డులతో ఆధార్ అనుసంధానం 90శాతం పూర్తయిందని, మిగిలిన వాటిని కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ-పాస్ బుక్‌లు జారీ చేసేందుకు ల్యాండ్ డేటా కంప్యూటరీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ఆ డేటా ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతుల వివరాలు, వారి పాస్‌పుస్తకాలు, సర్వే నంబరు వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తే రుణమాఫీ అమలు చేస్తారని వివరించారు. కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నందున ఈ వివరాలు సేకరిస్తోందన్నారు.

ఈ డేటా అనుసంధానం చేయటంలో హైదరాబాద్ ఎన్‌ఐసీ ద్వారా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల నుంచి ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇందుకోసం జీవో నంబరు 94, 97ను జారీ చేసిందన్నారు. ఈ జీవోలను క్షుణ్ణంగా చదివి అవగాహన పెంచుకుని అమలు చేయాలని సూచించారు. ఈ నూతన విధానంలో జరిమానాలను పెంచటం జరిగిందన్నారు. సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారి రంజిత్‌బాషా ఆధార్ సీడింగ్‌పై తహశీల్దార్లకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో డీఎస్‌వో సంధ్యారాణి, ఆర్డీవో సాయిబాబు, డీఐవో శర్మ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు