‘కొత్త లెవీ’కి ముందుగా సన్నద్ధం | Sakshi
Sakshi News home page

‘కొత్త లెవీ’కి ముందుగా సన్నద్ధం

Published Thu, Sep 4 2014 2:13 AM

‘కొత్త లెవీ’కి ముందుగా సన్నద్ధం

 విజయనగరం కంటోన్మెంట్ : మారిన లెవీ నిబంధనలననుసరించి పౌరసరఫరాల శాఖ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త నిబంధనల ప్రకారం 25 శాతం మిల్లర్లు, 75 శాతం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కసారిగా భారం  పెరిగినా, సేకరణ ప్రభావం ప్రజా పంపిణీపై పడకుండా  ముందుగానే ధాన్యం కొనుగోలు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు గాను జిల్లాలోని మహిళా సంఘాలు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేయాలని, జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల సూచి పెంచిన ధరల మేరకే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అధికారుల నిర్ణయం మేరకు గ్రేడ్ ‘ఎ’ రకం క్వింటాకు రూ.1400లు, కామన్ గ్రేడ్ రకం రూ.1360లుగా మద్దతు ధర చెల్లించనున్నారు. పెరిగిన కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరతోనే  బియ్యం సేకరించనున్నారు.
 
   జిల్లాలోని అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించి 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   కొత్త నిబంధనల ప్రకారం మిల్లర్లు తాము సేకరించిన ఉత్పత్తుల్లో 25 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఇస్తారు. దీంతో ప్రజాపంపిణీకి బియ్యం సరిపడని ప్రమాదముంది.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం  ముందుగా మేల్కొంది.  పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని ప్రజాపంపిణీకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మిల్లర్లపోటీని తట్టుకోవాల్సి ఉంది. ఇవ్వాల్సిన లెవీ తగ్గినందున బహిరంగ మార్కెట్లో పోటీ ఎక్కువై పౌరసరఫరాల శాఖ కొనుగోళ్లకు ధాన్యం దొరకనీయకుండా   మిల్లర్లు అడ్డుపడే ప్రమాదముంది. దీంతో ముందుగా తాము కూడా ధాన్యం సేకరించాల్సి ఉందన్న విషయాన్ని అధికారులు గ్రహించారు.
 
  ధాన్యం కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు, డీసీసీబీ ఆధ్వర్యంలోని సహకారం సంఘాల ద్వారా 46 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 60 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు.  వీటిని మిల్లర్ల ద్వారా ఆడించి ప్రజాపంపిణీకి వినియోగిస్తారు. ఇందుకోసం 20వేల మెట్రిక్ టన్నులు నిల్వచేసేందుకు గోదాముల అవసరం ఏర్పడుతుంది. అయితే డీసీసీబీ, డీఆర్‌డీఏల వద్ద ఉన్న నిల్వ కేంద్రాలలో 14,820 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు అవకాశం ఉంది.  మిగతా 5,180 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను ఎక్కడ నిల్వ ఉంచాలోనన్న విషయంలో మరి రెండు రోజుల్లో  గుర్తించాలని నిర్ణయించారు.
 
 అంచనా దిగుబడి 2.53 లక్షల మెట్రిక్ టన్నులు  
 జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 2.53లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో ఆలస్యమయినా కొన్ని చోట్ల మినహా దాదాపుగా సంతృప్తికరంగా ఉభాలు జరిగాయని భావిస్తున్నారు. ఉభాలు ఆలస్యమయినందున  దిగుబడి తగ్గినా...  2.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం  వస్తుందని అంచనా వేశారు. ఇందులో 30 శాతం రైతుల సొంత అవసరాలకు పోగా,  మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ముందుగా 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
 
 లక్ష్యాల ప్రకారం పనిచేయాలి: జేసీ
 రైతుల వద్ద ధాన్యం దళారుల పరం కాకుండా కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరననుసరించి కొనుగోలు జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.రామారావు చెప్పారు. బుధవారం జేసీ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు రమేష్ రెడ్డి, ఏడీఎం టెక్నికల్ భాస్కరశర్మలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నివేదికను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేదిక ప్రకారమే ఖరీఫ్ అనంతరం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈ నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.
 

Advertisement
Advertisement