కంప్యూటర్ ఆపరేటర్లకు బదిలీలు

24 Sep, 2015 23:37 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లను పక్కమండలాలకు  బదిలీచేయనున్నారు.   కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారానే   భూముల క్రయ విక్రయాల్లోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని నిర్ణయానికి వచ్చిన  అధికార యంత్రాంగం వారిని పక్క మండలాలకు బదిలీ చేయాలని  నిర్ణయించింది. ఈ మేరకు   కలెక్టర్   నాయక్ పరిపాలనాధికారి రమణ మూర్తికి  ఆదేశాలు జారీ చేశారు.  జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాలకూ ఉత్వర్వులు వెళ్లనున్నాయి.  ఆపరేటర్లందరినీ వారు పనిచేస్తున్న మండలాల నుంచి  పక్క మండలాలకు శనివారం నాటికి  బదిలీచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.   దత్తిరాజేరు మండలం జి మర్రివలస గ్రామంలో ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తుల పేరున వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు.  ఇందులోని అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఎటువంటి చర్యలూ లేవు. దీనికి సంబంధం లేని ఇతర కారణంతో అక్కడి వీఆర్వోను ఇటీవలే సప్పెండ్ చేశారు.   అలాగే భోగాపురం మండలంలో డిజిటల్‌కీ దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు   వచ్చాయి.  కానీ ఇక్కడా బాధ్యులెవరన్న విషయం తేల్చలేదు.  
 
 వీఆర్వవోల పర్యవేక్షణలోనే నమోదు
 కంప్యూటర్ ఆపరేటర్లకు కంప్యూటర్ పరిజ్ఞానమే కానీ భూముల క్రయ, విక్రయాలపై అవగాహన తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూముల అక్రమాలకు సంబంధించి వీఆర్వోలు, తహశీల్దార్ల ప్రమేయం లేకున్నా ఎలా జరుగుతున్నదన్న విషయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఉన్న వీఆర్వోలకు కనీస కంప్యూటర్ పరిజ్ఞానం  లేదు. దీంతో వారు   అధికారుల అనుమతితోనే కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గర కూర్చుని వివరాలు నమోదు చేస్తుంటారు. వెబ్‌ల్యాండ్ తదితర పనులన్నీ వీఆర్వోలు చెప్పిన విధంగానే చేశారు. అయితే ఇప్పుడు పలు మండలాల్లో జరుగుతున్న భూ అక్రమాలకు, అధికారుల నిర్లక్ష్యానికి కంప్యూటర్ ఆపరేటర్లే కీలకమని భావించి వారిని బదిలీలు చేస్తున్నారు. అయితే తాము చేయని తప్పునకు తమను బలి చేస్తున్నారని కంప్యూటర్ ఆపరేటర్లు వాపోతున్నారు.
 
 మహిళలకు మినహాయింపు
 బదిలీల విషయంలో మహిళలకు మినహాయింపునిచ్చినట్టు తెలిసింది. వీరిని మినహాయించి మిగతా వారిని బదిలీలు చేసేందుకు కసరత్తు  చేస్తున్నారు. దీనికి సంబంధించి    కంప్యూటర్ ఆపరేటర్ల జాబితాను తెప్పించుకుని ఎవరెవరెక్కడ ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారనే సమాచారంతో కలెక్టర్‌కు రిపోర్టు పంపిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయాలకు బదిలీ ఉత్తర్వులు వెళ్లనున్నాయి.
 
 వేతనాలు ఇవ్వడం లేదు కానీ...!
 తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న ఆపరేటర్లకు  దాదాపు తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు.  ఇటీవల కొన్ని నెలలకు సంబంధించి బడ్జెట్ విడుదలయినప్పటికీ ఇంకా బిల్లులు పెట్టలేదని తెలిస్తోంది. వేతనాలు ఇవ్వకుండా పని చేయించుకుని ఇప్పుడు తమకు బదిలీలు చేయడం సరికాదని ఆపరేటర్లు వాపోతున్నారు.  
 దత్తి రాజేరు తహశీల్దార్‌కు నోటీసులు   
 మర్రి వలసలో చోటు చేసుకున్న భూ మాయకు సంబంధించి దత్తి రాజేరు మండల తహశీల్దార్ పేడాడ జనార్ధన రావుకు నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఎంఎం నాయక్ నిర్ణయించారు.  తహశీల్దార్ కార్యాలయంలోని  అదనపు ఆపరేటర్ , వీఆర్వో, ఇతరుల అక్రమాలను గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తూ నోటీసును పంపించాలని కలెక్టరేట్ పరిపాలనాధికారికి ఆదేశించారు.  
 

మరిన్ని వార్తలు