రానున్నాయి 266 ‘చార్జింగ్‌ బంక్‌లు’

2 Mar, 2020 05:28 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు

కాలుష్య నియంత్రణ దిశగా మరో ముందడుగు

నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తే మేలంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణకు ఉపక్రమించాయి. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర భారీ పరిశ్రమలు, పట్టణాభివృద్ధి సంస్థలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర పురపాలక, విద్యుత్‌ శాఖలు సంసిద్ధమయ్యాయి. రాష్ట్రంలో స్మార్ట్‌ సిటీ, అమృత్‌ పథకం కింద ఎంపికైన నగరాల్లో మొదటి దశలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. ఇందుకోసం 266 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు (చార్జింగ్‌ బంక్‌లు) నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, ఇంధన శాఖలకు సమాచారం ఇచ్చింది. రాష్టంలో స్మార్ట్‌ సిటీల పథకం కింద ఎంపికైన విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు ఆ నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇందుకు అవసరమైన స్థలాలను సేకరించి చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రానికి కేటాయించిన 266 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లలో 1,412 చార్జర్లు ఉంటాయని భావిస్తున్నారు. 266 స్టేషన్లలో 133 స్లో చార్జింగ్, మరో 133 స్పీడ్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. స్లో చార్జింగ్‌ స్టేషన్లలో వాహనం మోడల్‌ను బట్టి చార్జింగ్‌ చేయడానికి 2 నుంచి 6 గంటల సమయం పడుతుంది. స్పీడ్‌ చార్జింగ్‌ స్టేషన్లలో అయితే వాహనం మోడల్‌ను బట్టి అరగంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్క చార్జింగ్‌ స్టేషన్‌లో ఒకేసారి సగటున 5 వాహనాలకు చార్జింగ్‌ చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

కాలుష్య నియంత్రణకు ‘ఫేమ్‌’
డీజిల్, పెట్రోల్‌ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఈవీల వాడకాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాల సత్వర తయారీ, వాడకం (ఫేమ్‌) పథకాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ చేయడమనేది ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి దేశంలో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. స్మార్ట్‌ సిటీ, అమృత్‌ పథకం కింద 100 నగరాలు ఎంపిక కాగా.. మొదటి దశలో 62 నగరాల్లో 2,636 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించారు. ఇందుకు ఆసక్తి గల సంస్థల నుంచి భారీ పరిశ్రమల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 106 సంస్థలు ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపించగా.. నిపుణుల కమిటీ వాటిలో 19 కంపెనీలను ఎంపిక చేసింది. 

మున్సిపాల్టీల్లోనూ ఏర్పాటు చేసే యోచన
రాష్ట్రంలో 31 పట్టణాలు అమృత్‌ పథకం కింద ఎంపికయ్యాయి. స్మార్ట్‌ సిటీలకు మంజూరు చేసిన 266 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లలో కొన్నిటిని అమృత్‌ పథకం కింద ఎంపికైన మున్సిపాల్టీల్లో కూడా నెలకొల్పితే ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని మరింతగా ప్రోత్సహించినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంది. కేంద్రం ఆమోదిస్తే 31 మున్సిపాలిటీలలో రెండేసి చొప్పున, మిగిలిన 204 స్టేషన్లను స్మార్ట్‌ సిటీలైన విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతిలలో నెలకొల్పాలని యోచిస్తున్నారు. అందుకు నిబంధనలను అనుమతించకపోతే మొత్తం స్టేషన్లను ఎంపికైన నాలుగు నగరాల్లోనే ఏర్పాటు చేస్తారు. కేంద్రం ఎంపిక చేసిన సంస్థలు ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు, డిస్కంలతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు