వినపడలేదా...ప్రసవ వేదన? 

2 Dec, 2019 09:33 IST|Sakshi
ఘోషాస్పత్రిలో ప్రసవించిన మహిళలు

పీహెచ్‌సీల్లో ప్రసవాలకు డాక్టర్ల వెనకడుగు 

రిఫరల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న వైద్యాధికారులు 

నిర్దేశించిన లక్ష్యాలు  చేరుకోవడంలో విఫలం 

నెలకు 10 ప్రసవాలు కూడా నిర్వహించని వైనం 

విజయనగరం ఫోర్ట్‌: రౌండ్‌ది క్లాక్‌ పనిచేసే పీహెచ్‌సీల్లో ప్రసవాలు అరకొరగానే సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేయలేకపోతున్నారు. జిల్లాలో నాలుగైదు పీహెచ్‌సీలు మినహా మిగతా చోట్ల ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 44 ఉన్నాయి. వీటిలో ఒక పీహెచ్‌సీ మాత్రం లక్ష్యానికి చేరుకోగా... రెండు పీహెచ్‌సీలు లక్ష్యానికి చేరువగా ఉన్నాయి. నెలకు ఒక్కో పీహెచ్‌సీల్లో 25 ప్రసవాలు జరిగాలి. ఏప్రిల్‌ నుంచి ఆక్టోబర్‌ నెలాఖరు నాటికి ఒక్కో పీహెచ్‌సీలో 175 ప్రసవాలు జరగాలి. కానీ చాలా చోట్ల రెండంకెలకు చేరుకోవడమే గగనంగా కనిపిస్తోంది.

 ఏ పీహెచ్‌సీల్లో ఎన్నెన్ని? 
ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నెలాఖరునాటికి ఏడు నెలల్లో ప్రతి పీహెచ్‌సీలో 175 ప్రసవాలు జరగాల్సి ఉన్నా  మొండెంఖల్లులో 248, బాగువలసలో 126, గురునాయుడు పేటలో 166 ప్రసవాలు, రామభద్రపురంలో 104 మాత్రమే జరిగాయి. ఇక నెలకు 10 ప్రసవాలు కూడ చేయని పీహెచ్‌సీలు ఉన్నాయి. తెర్లాంలో 64, తాడికొండలో 47, గోవిందపురంలో 47, మోపాడలో 62, పిరిడిలో 35, సీతానగరంలో 28, గర్భాంలో 42, గరివిడిలో 20, కర్లాంలో 10, గరుగుబిల్లిలో 36 , జియ్యమ్మవలసలో 58, రావాడ రామభద్రపురంలో 26, బొండపల్లిలో 11, చల్లపేటలో 21, దత్తిరాజేరులో 34, మెంటాడలో 52, మాదలింగిలో 20, గుర్లలో 17, బందలుప్పిలో 6, డోకశిలలో 52, కొమరాడలో 26, పి.బొండపల్లిలో 7, అలమండలో 31, జామిలో 37, కొత్తవలసలో 45, ఎల్‌.కోటలో 22, పెదమజ్జిపాలేంలో 26, వేపాడలో 18, వియ్యంపేటలో 35 ప్రసవాలు నిర్వహించారు.

రిఫరల్స్‌కే అధిక ప్రాధాన్యం 
పీహెచ్‌సీలకు ప్రసవాలకోసం వచ్చే గర్భిణులను జిల్లా ఆస్పత్రికిగాని కేజీహెచ్‌కు గాని ప్రసవాలకోసం రిఫర్‌ చేసేస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాదు... నిరుపేదలు సైతం సుదూరంలోని ఆస్పత్రికి వెళ్లలేక సతమతం అవుతున్నారు. 

వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం.. 
కొన్ని పీహెచ్‌సీల్లో నిర్దే«శించిన లక్ష్యం కంటే ఎక్కువగానే ప్రసవాలు జరుగుతుండగా మరి కొన్ని చోట్ల లక్ష్యానికి దగ్గరగా అవుతున్నాయి. తక్కువ ప్రసవాలు జరుగుతున్న వాటిల్లో లక్ష్యానికి అనుగుణంగా ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిపై పదే, పదే వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం.  
– డాక్టర్‌ ఎస్‌.వి.రమణకుమారి, డీఎంహెచ్‌ఓ   

మరిన్ని వార్తలు