పంట నష్టం నమోదు అస్తవ్యస్తం

4 Dec, 2013 03:13 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలో చీనీ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 48 వేల హెక్టార్లలో చీనీ తోటలు సాగయ్యాయి. రెండేళ్లుగా వర్షాభావం వెంటాడుతోంది. దీంతో సుమారు 8 వేల హెక్టార్లలో చీనీ చెట్లు ఎండిపోయాయి. వర్షాభావంతో పంట కోల్పోయి.. ఇన్‌పుట్ సబ్సిడీపై ఆశ పెట్టుకున్న చీనీ రైతులు దగా పడ్డారు. లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లితే రూ.6 వేలు మాత్రమే పరిహారం అందించి అధికార యంత్రాంగం చేతులు దులుపుకుంది. అందులోనూ అర్హులకు అన్యాయం చేసి.. అనర్హులకు అధికంగా పరిహారం జమ చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు తీవ్రం కావడంతో కంటికి రెప్పలా కాపాడుకున్న చీనీ తోటలు కళ్ల ముందే ఎండిపోయాయి. దీంతో పండ్ల తోటల రైతు బతుకులు ఛిద్రమయ్యాయి. రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు కొన్ని చోట్ల క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లి దెబ్బతిన్న పంటలను చూసి నష్టంపై వివరాలు నమోదు చేసుకున్నారు.
 
 మరికొన్ని చోట్ల కాకిలెక్కలతో నివేదిక తయారు చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చీనీ రైతులు అటు తహశీల్దార్లు, ఇటు ఉద్యానశాఖ అధికారులతో పాటు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కూడా విన్నవించుకున్నారు. అర్హులకు తప్పకుండా నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇటీవల ఉద్యానశాఖ అధికారులు ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) కింద సుమారు 1500 మందికి రూ.1.24 కోట్లు బ్యాంకులకు విడుదల చేశారు. నష్టపోయిన మేరకు పరిహారం దక్కుతుందని భావించిన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. పంట నష్టపోయిన రైతుల జాబితా తయారీలో రాజకీయ జోక్యం పెరగడంతో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న రైతులకు పరిహారం అరకొరగా వేశారనే విమర్శలు ఉన్నాయి.
 
 గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామ రైతు టి.బుగ్గన్నకు సర్వే నంబర్ 487-2లో 9 ఎకరాల చీనీ తోట ఉంది. 13 సంవత్సరాల వయస్సున్న 780 చెట్లు గతేడాది వర్షాభావం వల్ల నిలువునా ఎండిపోవడం చూసి దాదాపు రూ.4 లక్షల దాకా అప్పు చేసి 25 బోర్లకు పైబడి వేయించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చీనీ తోట ఎండిపోయింది. ఆ చెట్లను వంట చెరుకుగా వాడుకునే దుస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వ పరంగా సాయం చేసి ఆదుకుంటారని ఆశ పెట్టుకున్న బుగ్గన్నకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.6 వేలు మాత్రమే పరిహారం దక్కింది.
 
 ఇదే గ్రామానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డికి ఐదెకరాల్లో చీనీ తోట ఉంది. గతేడాది వేసవిలో వర్షాభావం వల్ల 600 చీనీచెట్లు దెబ్బతిన్నాయి. రూ.3 లక్షలు అప్పు చేసి 13 బోర్లు వేసి రక్షించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విధిలేని పరిస్థితిలో వాటిని నరికేశాడు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.6 వేలు మాత్రమే తన ఖాతాలో జమ కావడంతో ఖంగుతిన్నాడు. ఇలాంటి పరిస్థితి కేవలం బుగ్గన్న, పరమేశ్వర్‌రెడ్డిలదే కాదు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులకు ఎదురైన చేదు అనుభవం.
 

మరిన్ని వార్తలు