అక్షరాస్యత పెరిగితేనే అభివృద్ధి

27 Jul, 2014 01:03 IST|Sakshi

 మార్టూరు : అక్షరాస్యత శాతం పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. సమాజంలో గుర్తింపు రావాలన్నా.. మంచి జీవితం గడపాలన్నా విద్య ఎంతో అవసరమన్నారు. మార్టూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ మాట్లాడారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి పిల్లలు బడిబయట లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, డబ్బుతో కూడా పనిలేదన్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు పాఠశాలలో ఉండేలా చూడాలన్నారు. విద్య మంచి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్చడంలో మార్టూరు మండలం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పిల్లలు పాఠశాలకు వెళ్లేలా చూడాలని కోరారు.

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. ఇప్పటికీ వందకు 29 మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని, వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ.. బడిబయట ఉన్న పిల్లలను ఇప్పటికే పాఠశాలలో చేర్పించామని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా బడి బయట ఉంటే బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పాఠశాలకు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతి కిషోర్‌బాబు, ఎంపీడీఓ సింగయ్య, మార్టూరు సర్పంచ్ దేవుని దయానాయక్, మార్టూరు జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం జెన్నెట్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు