‘చేప’డితే చావే..!

28 Nov, 2018 10:37 IST|Sakshi
చెరువులు, కాలువల్లో విపరీతంగా పెరుగుతున్న రాక్షస చేప(దెయ్యం చేప)

పశ్చిమగోదావరి, ఆకివీడు: చేపలు మాంసాహారంలో ఓ భాగం. చేపల రుచికి అలవాటు పడిన వారు వీటిని అ మితంగా ఇష్టపడతారు. అయితే ప్రాణాంతకమైన చేపలు ఇటీవల చెరువులు, కాలువల్లో పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఓ రకం చేపను రాక్షస చేప లేదా దెయ్యం చేప అని పిలుస్తున్నారు.

ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మ కప్పబడినట్టు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ముల్లు గుచ్చుకుంటే ప్రాణాలు విడవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇటీవల ఉండి మండలం ఉప్పులూరులో ఆంజనేయులు అనే మత్స్యకారుడు రాక్షస చేప ముల్లు గుచ్చుకుని తీవ్రంగా బాధపడి తుదిశ్వాస విడిచాడు. ఇటీవల ఈ చేపలు చెరువుల్లో మేతను తిని వృద్ధిచెందుతున్నాయి. కిలో నుంచి మూడు కిలోల వరకూ రాక్షస చేప పెరుగుతుంది. కాలువల్లో పెరిగిన ఈ చేపలు నీటి ద్వారా చేపల చెరువుల్లోకి చేరుతున్నాయి. దీని వల్ల ఆక్వా రైతులు దెబ్బతింటున్నారు. చెరువుల్లో వేసిన మేతను ఇవి తినేస్తున్నాయి. చెరువులు పట్టుబడి సమయంలో టన్నుల కొద్దీ రాక్షస చేపలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటి నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చాలా ప్రమాదకరం
రాక్షస చేప చాలా ప్రమాదకరం. దీని ముల్లు గుచ్చుకుందంటే పాము కాటు కన్నా ప్రమాదం. కుట్టిన ప్రాంతం బరువెక్కి తీవ్రంగా బాధిస్తుంది. వైద్యం చేసినప్పటికీ ఫలితం ఉండదు. ఈ చేప ముల్లు గుచ్చుకుని ఉప్పులూరులో ఆంజనేయులు అనే వ్యక్తి చనిపోయాడు. రాక్షస చేపల నిర్మూలనకు చర్యలకు తీసుకోవాలి.– కృష్ణ, యానాది కులస్తుడు, ఆకివీడు

మరిన్ని వార్తలు