నంబర్ 1

29 Jan, 2014 22:49 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కిచ్చే బ్యాంకు లింకేజీ రుణాల్లో జిల్లా సరికొత్త రికార్డు సాధించింది. వార్షిక సంవత్సరం ముగింపునకు మరో రెండు నెలలు గడువున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యాన్ని అప్పుడే అధిగమించింది. జిల్లాలో 2013-14 వార్షిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన రుణ లక్ష్యాన్ని పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

 ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,614 స్వయం సహాయక సంఘాలకు రూ.214.87కోట్ల లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. వార్షిక సంవత్సరం చివరినాటికి మరో రూ. 25 కోట్ల లింకు రుణాలు ఇచ్చేందుకు ఆ శాఖ అధికారులు పరుగులు పెడుతున్నారు.

 లక్ష్యానికి మించి రుణాలు...
 జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 9,141 ఎస్‌హెచ్‌జీలకు రూ.228.98 కోట్లు ఇచ్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 4,999 ఎస్‌హెచ్‌జీలకు రూ.119.06 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటివరకు 8,614 సంఘాలకు రూ.214.87 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇందులో 142 సంఘాలకు రూ.5.03కోట్లు రెన్యువల్ కింద మంజూరు చేయగా.. మిగతా రుణాలన్నీ కొత్తగా ఇచ్చినవే.

 రికవరీల్లో జోష్.. మంజూరులో భేష్..
 స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న లింకు రుణాల రికవరీ ఆశాజనకంగా ఉంది. దాదాపు 92శాతం క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నట్లు ఐకేపీ అధికారులు అంతర్గతంగా చేసిన సర్వేలో తేలింది. రివకరీలు క్రమం తప్పకుండా వస్తున్నందునే రుణ మంజూరు ప్రక్రియ వేగిరంగా పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వార్షిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు 93శాతం రుణాలు మంజూరు చేశారు.

 ప్రస్తుతం మహిళా సంఘాలకు రూ.25కోట్ల రుణాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వార్షిక సంవత్సరం ముగిసేనాటికి మరికొన్ని సంఘాలకు కూడా రుణాలు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు