బర్ఖాసింగ్‌పై వేటు? | Sakshi
Sakshi News home page

బర్ఖాసింగ్‌పై వేటు?

Published Wed, Jan 29 2014 10:48 PM

Aam Aadmi Party government moves to replace DCW chief Barkha Singh

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందా? తమ ప్రభుత్వంలోని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీ చేసినందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్మన్ బర్ఖాసింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని చూస్తోందా? బుధవారంనాటి పరిణామాలను గమనిస్తే ఇదే అభిప్రాయం కలగక మానదు. డీసీడబ్ల్యూ చైర్మన్ పదవికి ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు మైత్రేయి పుష్ప పేరును సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ఆప్ సర్కార్ బుధవారం లేఖ రాసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ధ్రువీకరించారు. డీసీడబ్ల్యూ చైర్మన్‌గా ఇప్పటిదాకా రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులే ఉన్నారని, ఈ పద్ధతికి తాము స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. సామాజిక కార్యకర్తగా, సాహితీవేత్తగా మైత్రేయి మంచి గుర్తింపును పొందారని, డీసీడబ్ల్యూ చైర్మన్ పదవికి ఆమె వందశాతం అర్హురాలన్నారు. దీంతో ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్న బర్ఖాసింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలనే నిర్ణయానికి ఆప్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా అర్ధరాత్రి సోదాల వ్యవహారంలో న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఢిల్లీ మహిళా కమిషన్ ఇరుకునబెట్టడం ఆప్ సర్కారుకు రుచించడం లేదు. 
 
 ఢిల్లీ మహిళా కమిషన్  చైర్‌పర్సన్ బర్ఖాసింగ్  రాజకీయోద్దేశంతో పనిచేస్తున్నారంటూ ఇప్పటికే ఆప్ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత బర్ఖాసింగ్ తనంతట తానుగా రాజీనామా చేసి ఉండాల్సిందని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు ఈ విషయమై నిర్వహించిన సమావేశంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి బర్ఖాసింగ్‌ను తప్పించాలని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు డీసీడబ్ల్యూ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు. అయితే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి వైదొలగేది లేదని బర్ఖాసింగ్ స్పష్టం చేశారు. తన పదవీ కాలం ఇంకా ముగియలేదని, మరో 16 నెలలుందని, పదవీ కాలం ముగియక మునుపే తనను తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు మాత్రమే ఉందని ఆమె అంటున్నారు.
 

Advertisement
Advertisement