అలవిమాలిన నిర్లక్ష్యం

28 Apr, 2017 11:55 IST|Sakshi
అలవిమాలిన నిర్లక్ష్యం

► డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాల్సిన విత్తనాలు నేలపాలు
► రెండేళ్లుగా మెప్మా భవనంలో హైబ్రీడ్‌ కూరగాయల విత్తనాలు నిల్వ
► ప్యాకెట్లను చిందర వందర చేసిన ఎలుకలు
► కాల పరిమితి తీరడంతో ప్రజాధనం వృథా
► పీడీ మెతక వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది
► మెప్మా అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు

ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో విధులు నిర్వరిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు, ఇతర ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారు.  ఒంగోలు నగరంలో మెప్మా (పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ) పనితీరు కూడా ఇలానే ఉంది.

ఒంగోలు అర్బన్‌ :  డ్వాక్రా మహిళలు ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు వారి చేరడం లేదు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యం ఫలితంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతోంది. నగరంలో డ్వాడ్రా మహిళల గ్రూపులకు సంబంధించి పర్యవేక్షించాల్సిన మెప్మా ( పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. 

విత్తన ప్యాకెట్లు నేలపాలు
డ్వాక్రా మహిళలు కూరగాయలు పండించుకోవడంతో పాటు విక్రయించుకోవడానికి ప్రభుత్వం హైబ్రీడ్‌ కూరగాయల విత్తనాలను సరఫరా చేసింది. రెండ్లళ్ల క్రితం 2014–2015 సంవత్సరానికి గాను మహిళలకు ఈ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంది.  మెప్మా అధికారులు, సిబ్బంది వాటిని ఇంత వరకు పంపిణీ చేయకుండా నగరపాలక కార్యాలయంలోని మెప్మా భవనంలో నిల్వ ఉంచారు. రెండేళ్లుగా వాటి గురించి పట్టించుకోక పోవడంతో ఎలుకలు చేరి ఆ విత్తనాల ప్యాకెట్లను చిందర వందర చేశాయి.

దీనికి తోడు ఆ విత్తనాల కాలSపరిమితి తీరడంతో నిరుపయోగంగా మారాయి. టమోట, సొరకాయ, ఉల్లిపాయ, చిక్కుడు వంటి హైబ్రిడ్‌ విత్తనాల ప్యాకెట్లు వేల సంఖ్యలో కాలపరిమితి తీరిపోవడంతో సిబ్బంది వాటిని భవనం వెనుక కుప్ప పోశారు. డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఎంతో వెచ్చించి సరఫరా చేసినా వీటిని ఇలా నేలపాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ కొంత మెతక వైఖరి అవలంభించడం వలన మెప్మా అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగిపోయిందంటున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్‌కి అధికారులు, సిబ్బంది తప్పుడు సమాచారం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

రుణాల మంజూరులోనూ అవకతవకలే..
డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీలోనే మెప్మా సిబ్బంది ఇలా ఉండే డ్వాక్రా గ్రూపు, పలు కార్పొరేషన్‌లకు సంబంధించిన రుణాల విషయంలో కూడా భారీస్థాయిలో అక్రమాలు, అవినీతికి సిబ్బంది పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుణాలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాముళ్లు ఇచ్చే వారికి, తమకు అనుకూలంగా ఉన్న వారికే మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పేరుకే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినా పట్ణంలో పేదరిక నిర్మూలనకు చెప్పుకోదగ్గ చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. అవినీతితో మెప్మా అధికారులు, సిబ్బంది మాత్రం పేదరికం పోగొట్టుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆధ్వర్యంలో మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా విత్తనాలు పారేసిన భవనంలోనే దోమ తెరల పంపిణీ చేపట్టారు.  అదే రోజు ఆ విత్తనాల ప్యాకెట్లను బయటపడేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు