మూడోరోజుకు ‘విద్యుత్’ సమ్మె

14 Sep, 2013 03:55 IST|Sakshi


 సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె శుక్రవారానికి రెండురోజులు పూర్తిచేసుకుని మూరోరోజుకు చేరుకుంది. 13 జిల్లాల్లో సిబ్బంది సమ్మె పాటిస్తుండటంతో పాడైన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేసేవారు లేకపోవడంతో అనేక గ్రామాలు రాత్రివేళ చీకట్లోనే మగ్గుతున్నాయి.  విద్యుత్ సరఫరా లేక అనేక జిల్లాల్లో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఒక్కరోజే 12 ట్రాన్స్‌ఫార్మర్లు, కృష్ణాజిల్లాలో 11 పాడైపోయాయి. అయితే సిబ్బంది సమ్మె కారణంగా విద్యుత్ సరఫరాకు పెద్దగా ఆటంకం కలగలేదు. సమ్మెతో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి 10 మిలియన్ యూనిట్ల మేరకు తగ్గిపోయినా కళకళలాడుతున్న రిజర్వాయర్లు జెన్‌కోను కొంతవరకు ఆదుకున్నాయి.
 
 థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా.. సమ్మెకు ముందు రోజు అంటే 11వ తేదీన దాదాపు 83 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మేర విద్యుత్ ఉత్పత్తి జరగగా... సమ్మె నేపథ్యంలో 12వ తేదీకి ఇది కాస్తా 73 ఎంయూలకు పడిపోయింది.  భారీ వర్షాల వల్ల వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్‌టీపీపీ)లో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేసేందుకు ఎవరినీ సిబ్బంది లోపలికి అడుగు పెట్టనీయడం లేదు. మరోవైపు విజయవాడలోని ఎన్‌టీటీపీఎస్ 5వ యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్‌లీకు అయ్యింది. సిబ్బంది రాకపోవడంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మాత్రం పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండటంతో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగ్గా ఉంది. మొత్తం మీద సమ్మె ముందురోజు కేవలం 20 ఎంయూలు మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి కాగా సమ్మె మొదటిరోజు 12వ తేదీన ఇది కాస్తా 32 ఎంయూలకు చేరుకుంది. అయితే శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. సమ్మె మొదటి రోజు గురువారం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరగగా శుక్రవారం కేవలం 2 యూనిట్లకే ఉత్పత్తి పరిమితమయ్యింది.
 
 సీమాంధ్రలో చీకట్లు
 పశ్చిమగోదావరి జిల్లాలో 60కి పైగా ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. 600 ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరం జిల్లాలో 128 గ్రామాల్లో,  ప్రకాశం జిల్లాలో 20 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి  జిల్లాలో వంద గ్రామాలు, శ్రీకాకుళం జిల్లాలో 200 గ్రామాలు, విశాఖ జిల్లాలోని అనేక గ్రామాల్లో రాత్రి అంధకారం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 42చోట్ల విద్యుత్ లైన్లు తెగిపోయాయి. విశాఖ నగరంలోని పలుచోట్ల అంతరాయం ఏర్పడింది. ఈపీడీసీఎల్ పరిధిలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ సమస్యలను నివారించేందుకు జిల్లాకో ప్రత్యేక అధికారిని నియమించారు.  వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనంతపురం జిల్లా హిందూపురం, పెనుకొండ, రొద్దం, గోరంట్ల ప్రాంతాల్లో వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. మరమ్మతులు చేసేవారే లేకపోవడంతో చాలా గ్రామాల్లో సరఫరా నిలిచిపోయింది. సమ్మె ఫలితంగా ఓవైపు బిల్లింగ్, మరొకవైపు చెల్లింపులు నిలిచిపోయాయి.  
 
 ఉద్యమ పథంలో విద్యుత్ ఉద్యోగులు : సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల 72 గంటల  సమ్మెలో భాగంగా  రెండో రోజైన శుక్రవారం కూడా 13జిల్లాల్లో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. విద్యుత్ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీలు, కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి, నిరసన తెలిపారు. అటెండర్ స్థాయి నుంచి డీఈ వరకూ,  క్లర్కుల నుంచి జీఎం క్యాడర్ అధికారుల వరకు ఉద్యమంలో పాల్గొంటున్నారు.  పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 1,800 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో  12,500 మంది ఉద్యోగులు ఉంటే 97 శాతం మంది సమ్మెలో పాల్గొన్నారు.
 
 విద్యుత్ సౌధలో స్వల్ప ఉద్రిక్తత
 సాక్షి, హైదరాబాద్ :  తెలంగాణ ప్రాంతంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం చేపట్టిన ధర్నాతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యుత్ సౌధ సిబ్బంది కాకుండా సీపీడీసీఎల్‌కు చెందిన సంఘం నేతలు మోహన్‌రెడ్డి, జానయ్య తదితరులు లోపలికి వస్తుండటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో ఇంజనీర్ల సంఘం నేతలు శివాజీ తదితరులు జెన్‌కో ఎండీ విజయానంద్ చాంబర్‌లో గంటకుపైగా నేలపైనే బైఠాయించారు. ఎండీ జోక్యం చేసుకుని అరెస్టుచేసిన నేతలను విడిపించారు. ఆయనే ప్రధాన గేటు వద్దకు వచ్చి నేతల నుంచి వినతిపత్రాన్ని తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్లాంట్ల ఏర్పాటులో ఎలాంటి ఆలస్యం చేయడంలేదని వివరించడంతో నేతలు నిరసన విరమించారు.
 
  మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల (సేవ్) జేఏసీ విద్యుత్ సౌధలోనే నిరసన చేపట్టింది. విభజన ప్రక్రియ ఏ మాత్రం ముందుకు కదిలినా నిరవధిక సమ్మెకు వెళ్తామని సేవ్ జేఏసీ నేతలు గణేష్, నర్సింహులు, అనురాధ తదితరులు హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మహా ధర్నాలో జేఏసీ కో-ఆర్డినేటర్ కంచర్ల రఘు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణకు నిత్యం విద్యుత్ కోతలేనన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమమని, సమైక్యాంధ్ర ఉద్యమం జీవంలేని ఉద్యమమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టి.మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. బొగ్గు ఎక్కడ ఉత్పత్తి అవుతోందో అక్కడే విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ జెన్‌కో ఎండీకి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు