జోరుతగ్గని పోరు | Sakshi
Sakshi News home page

జోరుతగ్గని పోరు

Published Sat, Sep 14 2013 3:49 AM

జోరుతగ్గని పోరు


 సాక్షి నెట్‌వర్క్ : సమైక్యపోరు.. అలుపెరగకుండా 45రోజులుగా సాగుతున్న ఉద్యమం జోరు తగ్గడంలేదు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. సమైక్య, సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, రహదారుల దిగ్బంధం, మానవహారాలు, సమైక్య నినాదాలతో శుక్రవారం సీమాంధ్ర జిల్లాలు దద్దరిల్లాయి.
 
 అనంతపురంలో ఇటలీ దెయ్యాన్ని పారదోలుతామంటూ అధ్యాపక జేఏసీ నేతలు వేపమండలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రామగిరి మండలం పేరూరు నుంచి సమైక్యవాదులు ధర్మవరానికి బైకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వెయ్యిమీటర్ల జెండాతో ర్యాలీ చేపట్టారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజంపేటలలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో దీక్షలు సాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. రైల్వేకోడూరులో మోకాళ్లపై నడిచారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా క్రాస్ రోడ్డులో బైఠాయించి శాస్త్రోక్తకంగా మంత్రాలు పఠించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పుత్తూరు బంద్ నిర్వహించారు.
 
  తిరుపతిలో రుయా వైద్యులు, నర్సులు విభజనపరుల మాస్క్‌లు ధరించి, విద్యుత్ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కర్నూలులో సాయి భక్తులు ప్రార్థించారు. ఆత్మకూరులో మంత్రి ఏరాసు ఇంటి ఎదుట జేఏసీ నేతలు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయులు 48 గంటల నిరవధిక దీక్ష చేశారు. చీరాలలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. యర్రగొండపాలెంలో యాదవులు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో విద్యార్థి జేఏసీ నేతలపై దాడికి నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎస్పీ కాార్యాలయాన్ని ముట్టడించారు.  ఆర్టీసీ బంద్‌తో పాటు, విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె కొనసాగుతోంది.   
 
 ఇంటింటా సమైక్య జెండా
 తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై సమైక్య జెండా ఎగురవేశారు. ఇంటర్ విద్యార్థిని సునంద ఎనిమిది కిలోమీటర్ల సమైక్య పరుగు చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సెంటరులో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. ఏలూరులో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తాళ్లపూడిలో విద్యార్థులు కోలాట భేరి నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పొలికేక పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ జిల్లా అరకులో ఆకులు తింటూ జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. నర్సీపట్నంలో మునిసిపాల్టీ పరిధిలోని డ్వాక్రా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. నక్కపల్లి జేఏసీ దీక్షలు ముగిసాయి. విజయనగరం జిల్లా  చీపురుపల్లిలో కాంగ్రెస్, టీడీపీల వ్యక్తిగత దూషణలు చేసుకుని పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని   గరివిడిలో జేఏసీ ప్రతినిధులు అడ్డుకున్నారు. పలాసలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు గంగిరెద్దులతో ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ఆరుబయటే సేవలు అందించారు. టెక్కలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. రాజాంలో మహిళా ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీ చేశారు.
 
 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
 ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు సీమాంధ్ర జిల్లాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు.  బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా, సెంట్రల్ ఎక్సైజ్, జీవితబీమా, భారత ఆహారసంస్థ, బ్యాంకులు తదితర కార్యాలయాల్లో కార్యకలాపాలను స్తంభింపచేశారు.  కొన్నిచోట్ల కార్యాలయాలకు తాళాలు వేశారు. అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. జై సమైక్య నినాదాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్‌జీసీ, రిలయన్స్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కే ంద్రాలను ఏపీఎన్జీవోలు ముట్టడించారు. ఆయా కార్యాలయాల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విశాఖలోని బీఎస్‌ఎన్‌ఎల్  కార్యాలయాన్ని ముట్టడించిన 12 మంది ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
Advertisement