కౌండిన్యలో గజరాజులు కనుమరుగు! 

6 May, 2020 08:15 IST|Sakshi

ఇప్పటివరకు వివిధ కారణాలతో 18 ఏనుగులు మృతి 

ఇందులో కరెంట్‌ షాక్‌తో తొమ్మిది మృత్యువాత 

తాజాగా ఒంటరి మదపుటేనుగు మృతి

కౌండిన్య అటవీ సమీప గ్రామాల ప్రజలకు, పొలాల్లోకి వచ్చే ఏనుగులకు దినదినగండగా మారింది. ఏనుగుల కారణంగా రైతులు ప్రాణాలు, పంటలను కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీసుకుంటున్న చర్యలు ఏనుగుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇది అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది.

సాక్షి, పలమనేరు: కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీలో ఏనుగుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. వివిధ కారణాలతో గజరాజులకు ప్రాణగండం తప్పడం లేదు. మేత, నీటి కోసం అడవిని దాటి కరెంటు తీగలకు బలవుతున్నాయి. రైతులు వన్యప్రాణుల నుంచి పంటలకు రక్షణగా కరెంటు తీగలను అమర్చడం వల్ల కొన్ని చనిపోతున్నాయి. మరికొన్ని అనారోగ్యంతో చనిపోతున్నాయి. పదేళ్లలో వివిధ కారణాలతో 17 ఏనుగులు మృతిచెందాయి. పలమనేరు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను తగిలి గతంలో ఓ పిల్ల ఏనుగు మృతిచెందగా తల్లి ఏనుగు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. (నోట్లో బాటిల్‌ మెడలో పాము)

గత డిసెంబరులో బంగారుపాళెం మండలం మొగిలివారిపల్లిలో ఓ మదపుటేనుగు కిందిగా ఉన్న కరెంటు తీగలకు బలైంది. తాజాగా సోమవారం రాత్రి గంగవరం మండలం మన్నారునాయనిపల్లి సమీపంలో రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటుకు మరో మదపుటేనుగు బలైంది. ఏనుగులు అడవిలోంచి బయటకుపోకుండా అటవీ శాఖ చేపట్టిన సోలార్‌ ఫెన్సింగ్, ట్రెంచింగ్‌లు అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో అడవి లోపల, బయట వీటి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇలాగే కొనసాగితే కౌండిన్యలో ఏనుగులు కనుమరుగుకాక తప్పదు. 

మదపుటేనుగులకే  ఎక్కువ ప్రమాదాలు 
పలమనేరు ఫారెస్ట్‌ రేంజి పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో గతంలో 38దాకా ఏనుగులు ఉండేవి. ఈ పదేళ్లలో వీటి సంతతి పెరిగి 48కి చేరాయి. పలమనేరు రేంజికి సంబంధించి నాలుగు మదపుటేనుగులు ఒంటరిగా సంచరిస్తుండేవి. ఇందులో రౌడీ అనే పేరు కలిగిన ఏనుగు గతేడాది బంగారుపాళెం మండంలం శెట్టేరి మామిడితోపులో మృతిచెందింది. పలమనేరు మండలంలోని కాలువపల్లి గ్రామ సమీపంలో సంచరించే మరో మదపుటేనుగు మొగిలివారిపల్లి వైపు వెళ్లి కరెంట్‌ తీగలు తగిలి గత డిసెంబరులో మృతిచెందింది. మొన్నటిదాకా గాం«దీనగర్, జగమర్ల, మొగిలిఘాట్‌లో సంచరించిన మదపుటేనుగే సోమవారం రాత్రి మన్నారునాయునిపల్లి వద్ద రైతు పెట్టిన కరెంటు తీగలకు మృతి చెందింది. 

అడవిని విడిచి  ఎందుకొస్తున్నాయంటే..
కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవసరమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. దీనికితోడు మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీ శాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి, కౌండిన్య వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండడం లేదు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్‌ఫెన్సింగ్, ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లు దెబ్బతిని ఏనుగులు బయటకొచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా