విద్యుత్‌ శాఖలో నకిలీ కలకలం

30 Apr, 2018 11:48 IST|Sakshi
విద్యుత్‌ భవన్‌

బోగస్‌ సర్టిఫికెట్లతో లైన్‌మ్యాన్‌ ఉద్యోగం

నలుగురి సర్టిఫికెట్లు నకిలీవని తేల్చిన విజిలెన్స్‌ అధికారులు

చర్యలకు అధికారుల వెనకడుగు

అక్రమార్కుల నుంచి వసూళ్లు?

కర్నూలు(రాజ్‌విహార్‌): విద్యుత్‌ శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలంకలం సృష్టిస్తోంది. ఇందులో కొందరు లైన్‌మ్యాన్లు ఉన్నట్లు విజిలెన్స్‌ విచారణలో బహిర్గతం కావడం ఆ శాఖలో  చర్చనీయాంశంగా మారింది. బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరి అర్హులకు అన్యాయం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విచారణ నివేదిక ఉన్నతాధికారులకు పంపినా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్‌ శాఖకే ఝలక్‌..
నిత్యం వినియోగదారులకు షాక్‌ ఇచ్చే విద్యుత్‌ శాఖకు నకిలీ వీరులు ఝలక్‌ ఇచ్చారు. ఐటీఐ చదవకపోయినా బోగస్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కొత్తేమీ కాకపోయినా తాజాగా బయటపడిన భాగోతం మాత్రం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జిల్లా వ్యాప్తంగా నలుగురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తేలింది. వీరిలో కర్నూలు డివిజన్‌లో ముగ్గురు, డోన్‌ డివిజన్‌లో ఒకరు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా వీరంతా 2003 బ్యాచ్‌కు చెందిన వారని, 69 మంది ఉన్న ఆ బ్యాచ్‌లో మరికొంత మంది నకిలీలు ఉన్నారని సమాచారం. సీజేఎల్‌ఎంగా చేరి జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, లైన్‌మ్యాన్లుగా పదోన్నతులు పొంది నెలకు రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నట్లు తెలుస్తోంది.

డబ్బివ్వండి.. నేను చూసుకుంటా
‘నాకు డబ్బివ్వండి.. అంతా నేను చూసుకుంటా’ అని జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారి నకిలీ లైన్‌మ్యాన్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. ‘నాకు పైన అంతా తెలిసిన వాళ్లే.. మీపై చర్యలు లేకుండా చూస్తా’ అంటూ రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఆశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

బయటపడింది ఇలా..
ఓ అజ్ఞాత వ్యక్తి ‘విద్యుత్‌ శాఖలో పనిచేసే ఓ లైన్‌మన్‌ చిన్నప్పటి నుంచి తనతోపాటు చదివాడని, అతడు ఐటీఐ చేయలేదని, అతడిది బోగస్‌ సర్టిఫికెట్‌ అని, దీనిపై విచారణ జరపాలి’ అంటూ ఉన్నతాధికారులకు పిటిషన్‌ పెట్టాడు. ఈ మేరకు విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో అతడితోపాటు మరో ముగ్గురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజిలెన్స్‌ ఎస్‌ఐ స్థాయి అధికారి సంబంధిత కళాశాలలకు వెళ్లి ఆరా తీయగా బోగస్‌ సర్టిఫికెట్లుగా తేలినట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్‌ అధికారులు రిపోర్టును చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌కు పంపగా ఆయన వాటిని జేఎండీకి, ఆక్కడి నుంచి ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమచారం. బోగస్‌ అని తేలాకా  శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఇందుకు అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు