‘ఆ నలుగురు‘లో చీలిక

22 Oct, 2013 11:28 IST|Sakshi
‘ఆ నలుగురు‘లో చీలిక

 గంటా వర్గంలో  టికెట్ల గుబులు
 ‘దేశం’లోకి వెళ్దామంటే కార్యకర్తలు ససేమిరా
 ముందు జాగ్రత్తలతో  కొందరు కొత్త మార్గాలు
 
 ‘ఐదేళ్లుగా ఒకే మాటగా ఉన్నాం.. మంత్రి గంటా శ్రీనివాసరా వు అడుగులను అనుసరించాం..ఇప్పుడూ ఆయన వెంటే ఉంటే పరిస్థితి ఏంటి..నష్టపోతామేమో’.. గంటా గ్రూపులోని ఎమ్మెల్యేలను వెంటాడుతున్న సంశయమిది. అందుకే భారమంతా ఆయన మీద వేసినా ముందు జాగ్రత్త చర్య గా కొత్తదారులు వెదుక్కోవడం మంచిదనే ఆలోచనలో వీరంతా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
 
 ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన గంటా శ్రీని వాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీని వాసరావు, పంచకర్ల రమేష్‌బాబు ఐదేళ్లుగా ఒక వర్గంగా కొనసాగుతున్నారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కాకమునుపు, ఆ తర్వాత కూడా మిగతా ముగ్గురు గంటా నాయకత్వంలోనే పనిచేసుకుపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యలమంచిలి శాసన సభ్యుడు రమణమూర్తిరాజు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కూడా తాజాగా ఈ గ్రూపులో సభ్యత్వం తీసుకున్నారు.
 
  రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని, ఆ పార్టీ తరపున పోటీకి దిగితే నామినేషన్ వేసి ఇంట్లో కూర్చోవడం మంచిదని వీరంతా గట్టిగా నమ్ముతున్నారు. ఈ వర్గంలోని కొందరు బహిరంగంగానే ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అంతా కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని మంత్రి నాయకత్వంలో జరిగిన పిచ్చాపాటి సమావేశాల్లో ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. తాము ఎక్కడికెళ్లాలి?, ఏ పార్టీకి వెళితే ఎక్కడి నుంచి టికెట్లు ఇస్తారు?, అందరినీ ఎలా సర్దుబాటు చేస్తారనే భారం మొత్తం వీరు గంటా మీదే వేసి ఆయన నిర్ణయమే తమ నిర్ణయమనేలా కొనసాగుతూ వచ్చారు. ఇందులో భాగంగానే కేడర్‌ను కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు సమావేశాలు కూడా నిర్వహించారు.
 
 కానీ వీరంతా టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారనే ఊహాగానాలు సాగుతున్న తరుణంలో ఇటీవల ఒక శాసన సభ్యుడు పార్టీ కేడర్‌తో నిర్వహించిన సమావేశంలో ‘మీరు టీడీపీకి వెళితే వెళ్లండి. మేం మాత్రం ఆ పార్టీలోకి వచ్చేది లేదు’ అని మండల స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు సైతం తెగేసి చెప్పడంతో ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారని తెలిసింది. మరో ఎమ్మెల్యేకి కూడా ఇదే సెగ తగలడంతో ఏం చేయాలో పాలుపోక అనేక రకాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కోరుకుంటున్న పార్టీలో గ్రూపు మొత్తానికి  టికెట్లు దొరికే అవకాశాలు కనిపించడం లేదని, అలాంటప్పుడు తమ పరిస్థితి ఏమవుతుందని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారని తెలిసింది.
 
 చివరి వరకు ఇలా అనిశ్చితిలోనే గడిపి అంతా అయ్యాక ఎక్కడా బెర్త్ ఖరారు కాకపోతే రాజకీయంగా నష్టపోతామనే భయం వీరిని ఆవహించింది. దీంతో ఒక వైపు గంటాకు జై కొడుతూనే మరో వైపు తమ జాగ్రత్తలో తాము ఉంటున్నారు. అవకాశం దొరికితే కచ్చితంగా గెలుస్తామనే చోటికే చేరాలనే దిశగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
 
 
 

మరిన్ని వార్తలు