వికటించిన విందు భోజనం 

8 Apr, 2018 14:05 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి   

నాగిరెడ్డిపల్లిలో 100 మందికి అస్వస్థత

వాంతులు విరోచనాలతో ఆస్పత్రిపాలు

గ్రామానికి పరుగులు తీసిన     జిల్లా అధికారులు,వైద్యబృందం

నూజెండ్ల : విందు భోజనం వికటించి 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని కొత్తనాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకలకు చుట్టుపక్కల గ్రామాలైన లింగముక్కపల్లి, తంగిరాల, పాతనాగిరెడ్డిపల్లి, చింతలచెర్వు, యోగిరెడ్డిపాలెం గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. భోజనాల అనంతరం అర్ధరాత్రి ఒక్కొక్కరు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో స్థానిక వైద్యుల దగ్గరకు పరుగులు తీశారు. ఫుడ్‌ పాయిజన్‌ కారణమని ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. బాధితుల్లో సగం మంది చిన్నారులు వృద్ధులు ఉండటంతో గ్రామస్తులు తొలుత భయాందోనలకు గురయ్యారు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

హుటాహుటిన వైద్య శిబిరాలు ఏర్పాటు 
స్థానిక డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి సహకారంతో జిల్లా వైద్య బృందం, నియోజకవర్గం డాక్టర్లు, వైద్యసిబ్బందితో మండలంలోని లింగముక్కపల్లి, తంగిరాల, నాగిరెడ్డిపల్లిల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. నూజెండ్ల ప్రభుత్వ పాఠశాలల్లోనూ శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. 

పరిస్థితిని సమీక్షించిన అధికారులు 
నాగిరెడ్డిపల్లిలో 100 మందికి పైగా అస్వస్థతకు గురైయ్యారనే సమాచరం మేరకు జిల్లా అధికారులు గ్రామానికి పరుగులు తీశారు. తొలుత నూజెండ్ల తహసీల్దార్‌ పద్మాదేవి స్థానిక రెవెన్యూ సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టారు. ఏ గ్రామాల్లో బాధితులు ఎక్కువుగా ఉన్నారో ఆరా తీశారు. అనంతరం డీఎంఅండ్‌ హెవో యాస్మిన్, డెప్యూటీ డీఎం అండ్‌ హెవో శ్యామల, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ భానుప్రసాద్, ఆర్డీవో రవీంద్ర, డీఎల్‌పీవో కృష్ణమోహన్‌తోపాటు పలువురు అధికారులు పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదం లేదు
గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స చేస్తున్నాం. ఫుడ్‌ పాయిజన్‌ అయినప్పటికీ పెద్ద ప్రమాదం లేదు. పరిస్థితి అదుపులోకి వచ్చింది.  బాధితుల రక్త నమూనాలు సేకరించాం. పరీక్షల అనంతరం వివరాలు తెలియజేస్తాం.

– యాస్మిన్, డీఎం అండ్‌ హెవో 

మరిన్ని వార్తలు