దోపిడీ దొంగలు కానిస్టేబుళ్లే!

31 Oct, 2013 01:59 IST|Sakshi
దోపిడీ దొంగలు కానిస్టేబుళ్లే!

* వీడిన ‘టాస్క్‌ఫోర్స్ దోపిడీ’ మిస్టరీ
* నలుగురి అరెస్టు, రూ.48 లక్షలు స్వాధీనం
 
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు యువకులు నాలుగేళ్ల కింద కష్టపడి కానిస్టేబుళ్లు అయ్యారు.. అయితే కష్టపడకుండానే లక్షాధికారులు కావాలనుకున్నారు.. ‘దొంగ తెలివి’తో టాస్క్‌ఫోర్స్ పేరు చెప్పి రూ.50 లక్షలు దోచుకున్నారు. సీన్ కట్ చేస్తే.. నిజమైన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి 9 రోజుల్లోనే కేసు ఛేదించి ‘దొంగ కానిస్టేబుళ్ల’ను బుధవారం కటకటాల్లోకి నెట్టారు. వారికి సహకరించిన మరో నిందితుడినీ అరెస్టు చేశారు. ఈ నెల 21న నగరంలోని బంజారాహిల్స్‌లో జరిగిన ఈ దారి దోపిడీ, నిందితుల అరెస్టు వివరాలను పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు.

‘పొరుగింటి’ పరిచయంతో
గోషామహల్‌కు చెందిన ఠాకూర్ క్రాంతిసింగ్ గతంలో అబిడ్స్‌లోని హరిఓం కాన్ కాస్ట్ అండ్ స్టీల్స్ కంపెనీలో పనిచేశాడు. తన యజమానికి ఇతర కంపెనీల నుంచి రావాల్సిన సొమ్మును నగరంలోని హవాలా నిర్వాహకుల నుంచి వసూలు చేసే వాడు. ఎక్కడ ఆ కార్యకలాపాలు నడుస్తాయో పూర్తిగా తెలుసుకున్నాడు. జీతం విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో ఐదు నెలల కిందట ఉద్యోగం మానేశాడు. ఠాకూర్‌కు ఇటీవల తన పక్కింట్లో ఉండే చిక్కడపల్లి ట్రాఫిక్ ఠాణా కానిస్టేబుల్ వై.సచిన్‌తో పరిచయమైంది. అతని ద్వారా బేగంబజార్ కానిస్టేబుల్ జి.మహేందర్, చాదర్‌ఘాట్ కానిస్టేబుల్ సి.పురుషోత్తమ్‌లు కూడా స్నేహితులయ్యారు.

నాడు పట్టి.. నేడు ‘కొట్టాలని’
ఈ ఏడాది మార్చి-సెప్టెంబర్ మధ్య మహేందర్ మధ్యమండల డీసీపీ టీమ్‌లో పనిచేశాడు. అప్పట్లో ఓ హవాలా ముఠాను పట్టుకుని, రూ.30 లక్షలు రికవరీ చేసి పోలీసులకు అప్పగించాడు. ఈ అనుభవంతో హవాలా వ్యాపారులను దోచుకోవడానికి పథకం వేసి దాని గురించి మిత్రులతో చెప్పాడు. నలుగురూ ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 21న ఠాకూర్.. ముగ్గురు కానిస్టేబుళ్లనూ హవాలా లావాదేవీలు ఎక్కువగా సాగే కిషన్‌గంజ్‌లోని సావిత్రీ స్టీల్స్ దుకాణమున్న అహుజా కాంప్లెక్స్ వద్దకు తీసుకెళ్లాడు. సావిత్రి స్టీల్స్ నుంచి పి.సురేశ్, కొండల్‌రావు అనే వ్యక్తులు భారీ బ్యాగ్‌తో రావడం చూసిన ఈ గ్యాంగ్ వారిని అనుసరించింది.

సురేశ్, కొండల్‌రావులు బంజారాహిల్స్ రోడ్ నం.12లోని చైతన్య గ్రూప్ ఆఫీసు ఉద్యోగులు. వారు తమ సంస్థలకు చెందిన రూ.50 లక్షలు తీసుకొని మోటార్ సైకిల్‌పై ఆఫీసుకు బయల్దేరారు. దారిలో భోజనానికి ఆగా రు. రాత్రి 9.30 గంటలకు బంజారాహిల్స్‌రోడ్ నం. 12లోని శ్మశానం వద్దకు రాగానే.. ఠాకూర్, సచిన్‌లు నంబర్ లేని బైక్‌పై వచ్చి అడ్డుకున్నారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని, మీ దగ్గరున్న నగదు వివరాలు చెప్పాలని బెదిరించారు. పురుషోత్తం, మహేందర్‌లూ అక్కడికొచ్చారు. సికింద్రాబాద్‌లోని తమ ఆఫీసుకు రావాలంటూ నగదుతోపాటు సురేశ్‌ను తీసుకుని కొద్దిదూరం వెళ్లాక.. అతణ్ని వదిలేసి జూబ్లీహిల్స్‌వైపు పోయారు. తర్వాత మహేందర్ ఇంట్లో వాటాలు పంచుకున్నారు.

బాధితులు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు వెళ్లగా వారు పేర్కొన్న కానిస్టేబుళ్లు అక్కడ లేరని, బంజారాహిల్స్‌కు తమ వాళ్లను పంపలేదని అధికారులు చెప్పారు. దీంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించే బాధ్యతను అధికారులు టాస్క్‌ఫోర్స్ పోలీసులకే అప్పగించారు. అదనపు డీసీపీ బి.లింబారెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి, ఠాకూర్, మహేం దర్, సచిన్, పురుషోత్తమ్‌లను బుధవారం అరెస్టు చేసింది. వారినుంచి 48 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, వారిని బంజారాహిల్స్ ఠాణాకు అప్పగించింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు